
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమకు చెందిన నటుడు శివకార్తికేయన్( Sivakarthikeyan) సక్సెస్‌ఫుల్ బాటలో పరిగెడుతున్నాడు. ఇప్పటికే అయలాన్, మావీరన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఆయన ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మదరాసీ, సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మదరాసీ చిత్రం ముందుగా తెరపైకి రానుందని సమాచారం. కాగా పరాశక్తి తరువాత శివకార్తికేయన్ నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది.
ఇంతకు ముందు మాధవన్, విజయ్‌సేతుపతి హీరోలుగా విక్రమ్ వేదా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్–గాయత్రిల దర్శక ద్వయం ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. అయితే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సుడల్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. అలాంటిది తాజాగా ఈ దర్శక ద్వయం మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటుడు శివకార్తికేయన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.

పుష్కర్–గాయత్రి చెప్పిన కథ శివకార్తికేయన్‌కు నచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. కాగా నటుడు శివకార్తికేయన్ గుడ్‌నైట్ చిత్రం ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏ చిత్రం ముందుగా సెట్‌పైకి వెళుతుందో చూడాలి.