
ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ని మళ్లీ తెరపై చూపించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్‌గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.
అయితే 'మారిగల్లు' అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన‍్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్‌ని ఈ సిరీస్‌లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్‌కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు)