ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దొంగల్లా పరిగెట్టారు
ఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్ అవగానే సడన్‌గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్‌లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్ చెడిపోదా? ఒక ఫిలింమేకర్‌కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?
గుండెల్లో పెట్టుకున్నారు
మావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.


