తెలుగు దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కిష్టయ్య (73) మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కిష్టయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి మరణవార్తను సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు
బాపును తల్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. బాపు.. నువ్ లేకుండానే తెల్లారింది. నువ్ లేకుండానే ఓదెల లేచింది.. నువ్ లేకుండానే ఇల్లూ లేచింది. కల్లాపితో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది.. “ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు.. “ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు! చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది.
భుజంపై ఎత్తుకెళ్లావ్
గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నిన్నే కదా అనిపిస్తోంది. నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక.. మనం దున్నిన జంబు అరక.. పత్తి మందుకు పంపు.. పల్లి చేను లో సద్ది.. మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు.. ఇక అన్నీ జ్ఞాపకాలేనా? దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు.. మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు.. ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా?
నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి
ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా.. అంటూ ఎమోషనలయ్యాడు. సంపత్ నంది విషయానికి వస్తే ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ సినిమాలకు తెరకెక్కించాడు. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2, బ్లాక్ రోజ్ చిత్రాలకు కథ అందించాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 'భోగి' సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.


