Priyamani : పదేళ్ల తర్వాత.. కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న ప్రియమణి

Priyamani Entry Into Kollywood After 10 Years With D53 Movie - Sakshi

తమిళసినిమా: పరుత్తివీరన్‌ చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న నటి ప్రియమణి. తెలుగులోనూ కథానాయకిగా రాణించిన ఈమె వివాహనంతరం నటనకు చిన్న గ్యాప్‌ ఇచ్చారు. ఇటీవల సెకండ్‌ ఇన్సింగ్స్‌ ప్రారంభించిన ప్రియమణి తెలుగులో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో కన్నడం, తమిళ భాషల్లో డీఆర్‌ 56 అనే చిత్రంలో నటించారు. హరిహరా పిక్చర్స్‌ పతాకంపై ప్రవీణ్‌రెడ్డి నిర్మించి కథానాయకుడిగా నటించారు. రాజేష్‌ ఆనంద్‌ లీలా దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 9వ తేదీ తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.

కాగా దీన్ని తమిళం, తెలుగు భాషల్లో శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఏఎన్‌.బాలాజీ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం చెన్నైలో జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రియమణి మాట్లాడారు. తాను చారులత చిత్రం తరువాత తమిళంలో నటించిన చిత్రం డీఆర్‌ 56 అని తెలిపారు. 10 ఏళ్ల తరువాత కోలీవుడ్‌కు రీ ఎంట్రీ అవుతున్నట్లు చెప్పారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా ఆశ్చర్యపోయానన్నారు.

పలు ప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనలతో తయారు చేసిన కథ కావడమేనన్నారు. ఈ కథను చెప్పినట్లుగా తెరకెక్కిస్తే మంచి సక్సెస్‌ అవుతుందని దర్శకుడికి చెప్పానన్నారు. అదే విధంగా చిత్రం వచ్చిందని చెప్పారు. ఇది మెడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంగా ఉంటుందన్నారు. సమాజానికి అవసరం అయిన సందేశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. తాను ఇందులో సీబీఐ అధికారిణిగా నటించినట్లు చెప్పారు. చిత్రంలో కుక్క కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. చిత్రంలో ప్రియమణి అద్భుతంగా నటించారని నిర్మాత బాలాజీ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top