కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ | Karthi's Annagaru Vostaru Movie Review | Sakshi
Sakshi News home page

Annagaru Vostaru Review: తెలుగు వెర్షన్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. మూవీ ఎలా ఉందంటే?

Jan 30 2026 4:30 PM | Updated on Jan 30 2026 4:33 PM

Karthi's Annagaru Vostaru Movie Review

స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కొత్త సినిమా రిలీజైన ప్రతిసారీ ఇక్కడా ఆదరణ బాగానే వస్తూ ఉంటుంది. అలాంటిది కార్తీ లేటెస్ట్ మూవీ తెలుగు వెర్షన్‌ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. అదే 'అన్నగారు వస్తారు'. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
తాత(రాజ్ కిరణ్)కి ఎన్టీఆర్ అంటే అంతులేని అభిమానం. సరిగ్గా ఎన్టీఆర్ మరణించిన సమయానికి మనవడు పుడతాడు. దీంతో తన అభిమాన హీరో అంతా గొప్పవాడు కావాలని మనవడికి రామారావు(కార్తీ) అని పేరు పెడతాడు. తాత ఒకలా అనుకుంటే మనవడు మరోలా తయారవుతాడు. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు గానీ చేసేవన్నీ దొంగపనులు. కొందరు రాజకీయ నాయకులతో కలిసి అవినీతి చేస్తుంటాడు. ఇతడికి ప్రేతాత్మలతో మాట్లాడే ఓ ప్రియురాలు (కృతిశెట్టి) ఉంటుంది. ఓ సందర్భంగా మనవడి బుద్ధి గురించి తాతకు తెలిసిపోతుంది. తర్వాత ఏమైంది? రామారావు శరీరంలోకి అన్నగారి ఆత్మ ఎందుకు ప్రవేశిస్తోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఎప్పుడో మరణించిన ఓ మహానటుడి ఆత్మ, ఓ సాధారణ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి, ప్రజలకు మంచి చేస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో సినిమా తీయాలనుకోవడం ఆసక్తికరమే. చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ తీయడమే గజిబిజి గందరగోళం అయిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ చేయదు. పాటలో, డైలాగ్సో, సీన్సో.. ఏదో ఒకటి బాగున్నా సరిపెట్టుకోవచ్చులే అనుకోవచ్చు. ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఎంగేజ్ చేయదు. చూస్తున్నంతసేపు ఇలా చాలా అనిపిస్తాయి.

తమిళ స్టార్ హీరో ఎమ్‌జీఆర్ రిఫరెన్సులతో ఈ సినిమా తీశారు. ఫస్టాప్‌లో హీరో తాతయ్య ఎమ్‌జీఆర్ వీరాభిమాని కావడం, మనవడిని అలానే పెంచాలనుకోవడం, ఇదంతా నచ్చని మనవడు.. నటిస్తూ పెరగడం, అవినీతి పోలీస్ కావడం.. ఇలా పర్లేదులే ఏదో ఉందిలే అన్నట్లు మూవీ సాగుతుంది. భక్త వత్సలం అనే పాత్ర దగ్గరకు రామారావు వెళ్లేంతవరకు కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. తర్వాత కూడా అసలు కాన్‌ఫ్లిక్ట్ ఏంటో చెప్పకుండా స్టోరీని అటుఇటు తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. విలన్ భక్త వత్సలం.. ముఖ్యమంత్రితో కలిసి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తాడు. అదేంటో చెప్పకుండా చూపించకుండానే చిత్రాన్ని ముగించేశారు.

రామారావు పాత్ర.. ఉన్నట్టుండి అన్నగారిలా మారిపోయి ఫైట్స్ చేసేస్తుంటాడు. జనాల్ని కాపాడేస్తుంటాడు. ఇతడిలోకి అన్నగారి ఆత్మ లేదా తాతయ్య ఆత్మ ఏమైనా ప్రవేశించిందా అంటే అదేం ఉండదు. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే లాజిక్ ఉండదు. జనాలకు మంచి చేసే పసుపు ముఖం అని ఓ గ్రూప్ ఉంటుంది. వీళ్ల పాత్రలు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. హీరోయిన్ కృతిశెట్టి పాత్ర అయితే అసలు ఎందుకుందో అర్థం కాదు. చెప్పాలంటే ఆమె పోర్షన్ అంతా తీసేసినా సరే సినిమాలో పెద్దగా పోయిదేం ఉండదు.

లెక్క ప్రకారం డిసెంబరు తొలివారంలో సినిమాని తెలుగు, తమిళంలో రిలీజ్ చేయాలనుకున్నారు. నిర్మాత గతంలో చేసిన అప్పులు ఇప్పుడు ఆర్థిక సమస్యలుగా మారి కోర్టు కేసుల వరకు వెళ్లడంతో వాయిదా పడింది. సంక్రాంతికి విజయ్ 'జన నాయగణ్' రాలేకపోవడంతో దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళంలో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేయలేదు. కట్ చేస్తే నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని చూసిన చాలామంది.. కార్తీ ఇలాంటి మూవీ అసలు ఎందుకు చేశాడు? అని బుర్రగోక్కుంటున్నారు.

రామారావుగా చేసిన కార్తీ, తాతగా చేసిన రాజ్ కిరణ్ తప్పితే ఈ సినిమాలో మరో పాత్ర, ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. సత్యరాజ్, కృతిశెట్టి లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ వాళ్లని సరిగా ఉపయోగించుకోలేదు. అలానే తెలుగు వెర్షన్‌లో ఎన్టీఆర్ పేరుని ఉపయోగించుకున్నప్పుడు ఆయన ఫొటోలనే చూపించాలి. కానీ అలాంటిదేం లేకుండా తెరపై ఎమ్‌జీఆర్, డబ్బింగ్‌లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇది కాస్త కన్ఫ్యూజన్‌కి గురిచేసింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'అన్నగారు వస్తారు'ని లైట్ తీసుకోవడమే బెటర్.

-చందు డొంకాన

(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement