
హిందీ, తెలుగు, తమిళం అంటూ అన్ని ఇండస్ట్రీలలో పరుగులు పెడుతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde). మొదట్లో మాతృభాషలో నటించడం ప్రారంభించిన ఈ మరాఠీ బ్యూటీ ఆ తరువాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే ప్రతి విజయం వెనుక కఠిన శ్రమ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఎన్నో అవమానాలు, బాధలు, మనస్థాపం వంటి చేదు అనుభవాలు ఉంటాయి. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్‌తో బీస్ట్ చిత్రంలో జత కట్టారు.
ప్రస్తుతం నటుడు సూర్య సరసన నటించిన రెట్రో చిత్రం మే 1వ తేదీన తెరపైకి రానుంది. కాగా తాజాగా విజయ్‌కి జంటగా మరోసారి జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌కు జంటగా కాంచన 4 లో నటిస్తున్నారు.కాగా అగ్ర కథానాయకి రాణిస్తున్న పూజా హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. తన గురించి సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ చేశారన్నారు. అవి తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇంకో విషయం ఏమిటంటే నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టాలని కొందరు కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్స్ చేయించారని అర్ధం అయ్యిందన్నారు. అయితే, తనపై వచ్చిన ట్రోలింగ్ చూసి తల్లిదండ్రులు బాధపడినట్లు ఆమె చెప్పారు. ఆ ట్రోలింగ్ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలని తనను కొందరు కోరారని ఆమె తెలిపారు. అయితే, తానెవరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినా తనపై ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. అయితే కొంత కాలం తర్వాత అలాంటి ట్రోలింగ్స్‌ను పట్టించుకోవడం వదిలేశానని పూజా హెగ్డే చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనేనని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు.