Plan B Review: శ్రీనివాస్‌ రెడ్డి ప్లాన్‌ ఫలించిందా? లేదా?

Plan B Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ప్లాన్‌ బి
జానర్‌ :సస్పెన్స్ థ్రిల్లర్ 
నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ తదితరులు
నిర్మాణ సంస్థ : ఏవీఆర్ మూవీ వండర్స్
నిర్మాత : ఏవీఆర్ 
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం:  కెవి రాజమహి
సంగీతం : స్వర
నేపథ్య సంగీతం : శక్తికాంత్‌ కార్తీక్‌
డీవోపీ : వెంకట్ గంగాధరి
ఎడిటింగ్‌: ఆవుల వెంకటేష్
విడుదల తేది : సెప్టెంబర్‌ 17, 2021

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కథలో కొత్తదనం ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే టాలీవుడ్‌లో ఇటీవల చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్‌ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘ప్లాన్‌ బి’థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన  ట్రైలర్,టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన‘ప్లాన్‌ బి’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలకు సంతానం కలగదు. ఆ గ్రామంలోని పురుషులకు వీర్యకణాలు తగ్గిపోవడం వల్లే పిల్లలకు పుట్టరు. ఈ క్రమంలో ఆ ఊరికి వచ్చిన ఓ డాక్టర్‌ మంచి వైద్యాన్ని అందించి అందరికి సంతానం కలిగేలా చేస్తాడు. అయితే గ్రామంలోని ఓ జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. దీంతో ఆ వైద్యుడు తన వీర్యాన్ని అందించి ‘ఐవీఎఫ్’పద్ధతిలో వారికి బిడ్డను అందిస్తారు. కట్‌ చేస్తే..  ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి చనిపోయే ముందు తన కూతుకు రూ. 10 కోట్లు ఇస్తాడు. అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించబడుతుంది. మరోవైపు లాయర్‌ విశ్వనాథ్‌(శ్రీనివాస్‌ రెడ్డి), ప్రైవేట్‌ టీచర్‌ రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. ఈ హత్యలకు, రూ. 10 కోట్ల దొంగతనానికి సంబంధం ఏంటి? ఆ డబ్బును ఎవరు దొంగిలించారు? ఈ కేసును పోలీసు అధికారి( మురళీ శర్మ) ఎలా చేధించాడు? అసలు ఈ కథకి డాక్టర్‌కి సంబంధం ఏంటి? ప్లాన్‌ బి అంటే ఏంటి? అది ఎవరు వేశారు? అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే..?
ఎప్పటి మాదిరే  శ్రీనివాస్‌ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాకు కీలకమైన లాయర్‌ విశ్వనాథ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ప్రేమికుడు గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట తనదైన నటనతో మెప్పించాడు. ఫైట్‌ సీన్స్‌లో కూడా అవలీలగా నటించాడు. ప్రతినాయకుడిగా కునాల్‌ శర్మ  అధ్బుత నటనను కనబరిచాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర మురళి శర్మది. పోలీసు అధికారి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్‌ ఆకట్టుకుంటుంది. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. 

ఎలా ఉందంటే..
సస్పెన్స్ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు కెవి రాజమహి. ఆయన ఎంచుకున్న పాయింట్స్‌, రాసుకున్న స్క్రీన్‌ప్లే, డిజైన్‌ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. ప్లాన్‌ బి కథ చాలా క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. అయినప్పటికీ.. ఎక్కడా లాజిక్‌ మిస్‌ కాకుండా ప్రతి క్యారెక్టర్‌ని, సీన్‌ని చాలా క్లియర్‌గా, ప్రేక్షకుడికి కన్‌ప్యూజన్‌ లేకుండా తెరపై చూపించాడు. అయితే కాస్త పేరున్న నటులను తీసుకొని ఉంటే ఆయన తపనకు సరైన ఫలితం ఉండేది. కథలో చాలా వరకు ఫేమస్‌ కానీ నటులు ఉండడం కాస్త మైనస్‌. పోలీసుల విచారణ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తాయి. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్‌, ఏం జరిగిందో ముందో ఊహించడం కాస్త సిల్లీగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్‌ వచ్చే ట్విస్ట్‌ అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంతగా ఉంటుంది. స్వర సంగీతం, శక్తికాంత్‌ కార్తీక్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకొనేలా ఉంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top