Oscar Award Indian Winners: రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన ఇండియన్ ఎవరంటే?

Oscar Award Winners From India Till now - Sakshi

ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. 

తొలి ఆస్కార్‌ విన్నర్ భాను అథైయా

భాను అథైయా తొలి భారత ఆస్కార్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్‌ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు.

సత్యజిత్‌ రే 
భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్‌ రే ఆస్కార్‌ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్‌రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్‌ అందజేసింది. 

రెండు అవార్డులు గెలిచిన ఏఆర్‌ రెహమాన్‌
బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఏకంగా రెండు ఆస్కార్‌ అవార్డులు సాధించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకూ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో ఈ  అవార్డులు దక్కించుకున్నారు.  రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

రసూల్‌ పూకుట్టి
స్లమ్ డాగ్‌ మిలియనీర్‌ సినిమాకు ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ కేటగిరీలో రసూల్‌ పూకుట్టి ఆస్కార్‌ సొంతం చేసుకున్నారు.

గుల్జర్‌
దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్‌ 81వ ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆయన్ను ఆస్కార్‌ వరించింది.

గునీత్‌ మోన్గా
ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్‌ మోన్గాఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలింగ్‌గా పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌ ఏ సెంటెన్స్‌కు గునీత్‌ ఆస్కార్‌ గెలుచుకుంది.

తాజాగా అమెరికాలో లాస్‌ఎంజిల్స్‌ జరగనున్న 95వ ఆస్కార్‌ అవార్డులకు ఇండియా నుంచి ఆల్‌ దట్‌ బ్రెత్స్( బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిలిం)‌, ది ఎలిఫెంట్‌ విస్ఫరర్స్(బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం)‌, నాటు నాటు(బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌) విభాగాలలో నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్‌పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top