'నేడే విడుదల' మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Nede Vidudala Movie review: 'నేడే విడుదల' మూవీ రివ్యూ

Published Fri, Mar 10 2023 9:42 PM

Nede Vidudala Movie review - Sakshi

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ పతాకంపై అసిఫ్ ఖాన్ - మౌర్యాని జంటగా నటించిన చిత్రం "నేడే విడుదల". నూతన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం మార్చి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రం ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే: 
సినిమాలను ప్రమోషన్ చేసే ఓ కంపెనీలో సిద్ధూ(అసిఫ్ ఖాన్) పనిచేస్తూ ఉంటారు. అదే సమయంలో హారిక (మౌర్యాని)ని ప్రేమిస్తాడు. నిర్మాత సత్యానంద్ (డైరెక్టర్ కాశీ విశ్వనాథ్) ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మించి... దానిని ప్రమోట్ చేయాల్సిందిగా సిద్ధూని కోరతాడు. సినిమాని ప్రమోట్ చేసి... ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేంతగా మూవీకి హైప్ తీసుకొస్తాడు సిద్ధూ. అంత బాగా ఓపెనింగ్స్ వచ్చిన సినిమా... పైరసీ బారిన పడి అనుకోకుండా డౌన్ ఫాల్ కావడంతో నిర్మాత సత్యానంద్ చనిపోతారు. అంత పెద్ద నిర్మాత మరణించడం సిద్ధూ జీర్ణించుకోలేకపోతాడు. అసలు నిర్మాత చనిపోవడానికి కారణాలు ఏంటి? అతని మరణం సమంజసమేనా? అంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకి ఉన్నట్టుండి కలెక్షన్లు పడిపోవడానికి గల కారణాలను సిద్ధూ తెలుసుకున్నాడా? తెలుసుకుని ఉంటే ఏమి చేశాడు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ ఎలా సాగిందంటే..
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.  ఆసక్తికరమైన కథనంతోపాటు ఆలోచింపచేసే ఓ మెసేజ్ ఇచ్చాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయిన ఈ చిత్రంలోని సన్నివేశాలు... సెకండాఫ్‌లో ఓవైపు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌తో పాటు సినిమాలో మూలాలను వెతికే సన్నివేశాలను చూపించారు. సెకెండాఫ్‌లో మంగళూరుకి స్టోరీ షిఫ్ట్ అయిన తరువాత హీరోయిన్ ఇంట్లో వచ్చే ‘శాకాహారం’ కామెడీ సరదాగా నవ్విస్తుంది. దానికి తోడు ఆహ్లదపరిచే సంభాషణల ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఎప్పుడూ రొటీన్ ఫుడ్ అలవాటు పడిన వారికి శాకాహారం తీసుకుంటే వారి జీవన శైలి ఎలా ఉంటుంది? వాటి వల్ల ఆయుష్షును ఎలా పెంచుకోవచ్చు? తదితర విషయాలన్ని ఆడియన్స్ కి పనికొచ్చేవే. అలాగే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా... రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడం వల్ల నిర్మాతలు ఆర్థికంగా ఎలా నష్టపోతారనేది ఇందులో చూపించారు. గతంలో ఇలాంటి చాలా సినిమాలు ఉన్నా... ఇందులో దానికి పరిష్కారం చూపించడం కొత్తగా ఉంది.

ఎవరెలా చేశారంటే..

హీరో ఆసిఫ్ ఖాన్ బాధ్యతగల యువకుని పాత్రలో చక్కగా నటించారు. అతనికి జోడీగా మౌర్యాని  గ్లామర్‌తో యువతను బాగా ఆకట్టుకుంది. నిర్మాత పాత్రలో దర్శకుడు కాశీవిశ్వనాథ్ కాసేపైనా మెప్పించారు. హీరో స్నేహితులు,  హీరో తండ్రి పాత్రలో అప్పాజీ అంబరీషా తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా పాత్రల్లో నటించిన మాధవి, టి.ఎన్.ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ తమ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే కథ నడిపించడంలో రామ్ రెడ్డి పన్నాల విజయం సాధించారు. అజయ్ అరసాడ అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్‌లో కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. సీహెచ్ మోహన్ చారి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement