మీనాక్షీ చౌదరి, బాబీ, నవీన్ పొలిశెట్టి, నాగవంశీ
'‘నిర్మాత నాగవంశీ సినిమాని ఎంతో ప్రేమిస్తాడు. సినిమాని ఎంత ప్రేమిస్తే, అంత మంచి విజయం వస్తుందని మాలాంటి వారు కూడా వంశీని చూసి నేర్చుకోవాలి. మూవీ కోసం నవీన్ పొలిశెట్టి ప్రాణం పెడతాడు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ‘అనగ నగా ఒక రాజు’’ అని నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ ‘దిల్’ రాజు చెప్పారు.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవానికి ‘దిల్’ రాజు, దర్శకుడు బాబీ కొల్లి అతిథులుగా హాజరయ్యారు.
బాబీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల నేను చిరంజీవిగారిని కలిసినప్పుడు... ‘అనగనగా ఒక రాజు’ బాగుందట కదా... ఈ తరంలో నాకు బాగా నచ్చిన హీరో నవీన్’’ అన్నారు. ‘‘ఈ సంక్రాంతి మా యూనిట్‌కి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది’’ అని నవీన్ పొలిశెట్టి చెప్పారు. ‘‘మా డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశామనడం సంతోషాన్నిచ్చింది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చూసి మా కష్టమంతా మర్చిపోయాను’’ అని మారి తెలిపారు. మీనాక్షీ చౌదరి, రచయిత్రి, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి, రచయిత చంద్రబోస్ మాట్లాడారు.


