నాని గురించి ఆసక్తికర విషయాలు..

Nani Birthday Special: Look At His Career - Sakshi

నాని ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆయన 25 సినిమాలు చేశాడు. అంతే కాదు కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడీ గ్యాంగ్‌ లీడర్‌. 'భలే భలే మగాడివోయ్‌'లో మతిమరుపున్న వ్యక్తిలా, 'నిన్ను కోరి'లో ప్రేమించిన అమ్మాయికి పెళ్లైనా ఆమెను మనసులో నుంచి తీసేయలేక ప్రత్యక్ష నరకం అనుభవించిన భగ్న ప్రేమికుడిలా, 'ఈగ'లో చనిపోయాక ఈగ అవతారం ఎత్తి మరీ ప్రేమికురాలిని వెన్నంటి ఉండి కాపాడుకునే రక్షకుడిలా నటించి మెప్పించాడు. విభిన్నతకు పెద్ద పేట వేసే అతడిని అభిమానులు నేచురల్‌ స్టార్‌ అని పిలుచుకుంటారు. నేడు నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత, కెరీర్‌ విషయాలను ఓసారి తెలుసుకుందాం..

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రస్థానం మొదలు..
నేచురల్‌ స్టార్‌ నాని అసలు పేరు గంటా నవీన్‌ బాబు. కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం స్వస్థలం. ఇతడు గంటా రాంబాబు, విజయలక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించాడు. అందరు కుర్రాల్లాగే నానికి కూడా సినిమాలంటే ఇష్టం. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ ఇష్టం కూడా పెద్దదైంది. దీంతో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగానే చదువు మధ్యలో వదిలేసి అవకాశాల కోసం డైరెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగేలా తిరిగిన నానికి ఎట్టకేలకు బాపు 'రాధాగోపాలం' సినిమాకు క్లాప్‌ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. అక్కడ తనేంటో ప్రూవ్‌ చేసుకున్న అతడు తర్వాత రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రేడియోజాకీలో పనిచేస్తున్న సమయంలో దర్శకుడు ఇంద్రగంటి మోమన్‌కృష్ణ ‘అష్టాచమ్మా ’సినిమాలో ఛాన్స్‌ ఇచ్చాడు. తొలుత సెకండ్‌ లీడ్‌గా తీసుకుందామనుకున్నా నానినటనకు ఇంప్రెస్‌ అయ్యి ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. అలా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి సినీ హీరోగా ఎదిగాడు.

బ్రేకిచ్చింది ఆ సినిమానే..
తర్వాత తన దగ్గరకు వచ్చిన కథలన్నీ ఓకే చెప్తూ రైడ్‌, స్నేహితుడా, భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలు చేశాడు. కానీ ఇవి అతడికి పెద్దగా విజయాన్ని తెచ్చిపెట్టలేవు. 2011లో నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పింది. 2012లో రాజమౌళి ఈగలో నాని నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. అదే ఏడాది గౌతమ్‌ మీనన్‌ ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలో సమంతతో కలిసి నటించిన నాని నంది అవార్డును సైతం అందుకున్నాడు. 

వరుసగా 8 సినిమాలు హిట్టే..
నటుడిగా తనకిక ఎటువంటి ఢోకా లేదనుకుని నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడీ హీరో. నిర్మాతగా డీ ఫర్‌ దోపిడీ సినిమా తీశాడు. కానీ ఇది నాని అంచనాలను తలకిందులు చేస్తూ భారీ నష్టాలను మిగిల్చింది. పైసా, జెండాపై కపిరాజు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దీంతో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన నాని సినీ కెరీర్‌ ఇక ఏమైపోతుందో అన్న సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం అతడికి హిట్టిచ్చి ఆదుకోగా భలే భలే మగాడివోయ్‌ అతడిని మళ్లీ సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత చేసిన 8 సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో మరోసారి నిర్మాతగా ట్రై చేసిన నాని అ, హిట్‌ సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. లాక్‌డౌన్‌లో వి సినిమాతో నిరాశపర్చిన ఈ హీరో ప్రస్తుతం టక్‌ జగదీష్‌, శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికి సినిమాల్లో నటిస్తున్నాడు. వెండితెర మీద మెప్పించిన ఆయన బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ తెలుగు రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించి అలరించాడు.

నాని వ్యక్తిగత విషయానికి వస్తే.. 2012లో నాని అంజనా ఎలవర్తిని పెళ్లాడాడు. 2017లో వీరికి అర్జున్‌(జున్ను) అనే కొడుకు పుట్టాడు. అమ్మమ్మ చేసే చేపల పులుసు అంటే ఈ హీరో లొట్టలేసుకుని మరీ తింటాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాడు. బాలీవుడ్‌కు వెళ్లే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పాడు. సినిమా హిట్టైనా, ఫట్టైనా ఇక్కడే ఉండిపోతానంటున్నాడు. నాని కెరీర్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం కూడా ఉంది. కింగ్‌ నాగార్జునతో కలిసి దేవదాసు చేశాడు. కానీ ఇది బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ‘ఆచార్య’లో మంచి పాత్ర పోషిస్తున్నా..

రానాతో సాయిపల్లవి కోలు.. కోలు...

టీజర్‌: ఫైటింగ్‌కు పెళ్లి కొడుకు రెడీ!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top