దేశ ఆర్థిక రాజధాని, మాయానగరిగా పేరొందిన ముంబై కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది కోట్ల మంది కలల నిలయం. హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్)కు కేంద్ర బిందువైన ఈ నగరం, దశాబ్దాలుగా ఎంతో మంది దర్శకులకు అద్భుతమైన కథా వేదికగా నిలిచింది. ఇక్కడి లోకల్ రైళ్లు, రద్దీగా ఉండే గల్లీలు, ఆకాశహర్మ్యాలు, మురికివాడలు.. సినిమా స్క్రిప్ట్‌లలో కీలక పాత్రలుగా మారిపోయాయి. ముంబై నగర జీవన విధానాన్ని, అక్కడి విభిన్న పార్శ్వాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించిన బాలీవుడ్ చిత్రాలివే..
నగర జీవితాల అంతర్లీన బంధాలు
అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఇన్ ఎ... మెట్రో' సినిమా ముంబై ఆధునిక జీవన విధానానికి అద్దం పడుతుంది. నగర జీవితంలో మనుషుల మధ్య ఉండే సంబంధాలు, ఆకాంక్షలు, వారు ఎదుర్కొనే సవాళ్లను విభిన్న కథల ద్వారా ఇందులో చూపించారు. కిక్కిరిసిన లోకల్ రైళ్లు, నైట్ లైఫ్, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత కోసం సామాన్యులు పడే తాపత్రయాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. అదేవిధంగా, హన్సల్ మెహతా తెరకెక్కించిన ‘సిటీలైట్స్’ చిత్రం ఒక గ్రామీణ కుటుంబం మెరుగైన జీవితం కోసం ముంబైకి వలస వచ్చి ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులను, వారి భావోద్వేగాలను ఆవిష్కరించింది.
లోకల్ రైళ్లు.. డబ్బావాలాల మ్యాజిక్
ముంబై లైఫ్ లైన్ అనదగ్గ లోకల్ రైళ్ల నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘ఏక్ చాలీస్ కీ లాస్ట్ లోకల్’. అర్ధరాత్రి వేళ లోకల్ ట్రైన్ మిస్సయిన ఇద్దరు వ్యక్తులు నగర వీధుల్లో ఎదుర్కొన్న ఊహించని, నవ్వు తెప్పించే సంఘటనలను ఈ డార్క్ కామెడీ చిత్రంలో చూపించారు. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ‘ది లంచ్ బాక్స్’ సినిమా ముంబైలోని ‘డబ్బావాలా’ వ్యవస్థ ఆధారంగా రూపొందింది. ఒక లంచ్ బాక్స్ డెలివరీ తారుమారు కావడం వల్ల ఇద్దరు ఒంటరి వ్యక్తుల మధ్య చిగురించిన పరిచయం, నగరంలోని యాంత్రిక జీవితంలో మానవీయ బంధాల విలువను చాటిచెప్పింది.
విషాదం నుండి కోలుకున్న ముంబై స్పిరిట్
ముంబై నగరంపై జరిగిన దాడులు, అక్కడి ప్రజల మనోధైర్యాన్ని చాటే చిత్రాలు కూడా బాలీవుడ్‌లో వచ్చాయి. 2006 ముంబై రైలు పేలుళ్ల నేపథ్యంలో నిషికాంత్ కామత్ రూపొందించిన ‘ముంబై మేరీ జాన్’ చిత్రం, ఆ ఘోర విపత్తు తర్వాత నగర ప్రజలు ప్రదర్శించిన ఐక్యతను, వారి జీవన పోరాటాన్ని అద్భుతంగా చూపించింది. మరోవైపు, శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’ చిత్రం, 2008 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం దేశభక్తితో పాటు విపత్కర పరిస్థితుల్లో ముంబై నగరం చూపిన గుండె నిబ్బరాన్ని ప్రతిబింబించింది.
మురికివాడల వాస్తవికత.. మానవ హక్కుల పోరాటం
మీరా నాయర్ క్లాసిక్ చిత్రం ‘సలామ్ బాంబే’.. ముంబై వీధుల్లోని అట్టడుగు వర్గాల, ముఖ్యంగా వీధి బాలల కఠిన జీవితాలను ప్రపంచానికి పరిచయం చేసింది. పేదరికం, ఆకలి, మనుగడ కోసం వారు చేసే పోరాటం ఇందులో అత్యంత వాస్తవికంగా ఉంటుంది. అలాగే హన్సల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన బయోపిక్ ‘షాహిద్’, ముంబైలో 2010లో హత్యకు గురైన మానవ హక్కుల న్యాయవాది షాహిద్ అజ్మీ జీవితాన్ని ఆవిష్కరించింది. ముంబైలోని న్యాయ వ్యవస్థ సంక్లిష్టతలను, అన్యాయంగా నిందపడిన వారి కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటాన్ని ఈ సినిమా చూపించింది. కిరణ్ రావు చిత్రం ‘ధోబీ ఘాట్’ కూడా నగరంలోని సాంస్కృతిక, ఆర్థిక వైవిధ్యాన్ని నలుగురు వ్యక్తుల కోణంలో ఆసక్తికరంగా చూపించింది.
‘పేజ్ 3’ సంస్కృతి.. క్రైమ్ అండర్ వరల్డ్
మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పేజ్ 3’ సినిమా ముంబై హై-సొసైటీ, సెలబ్రిటీల విలాసవంతమైన జీవితాలు, మీడియా ప్రపంచం వెనుక ఉన్న చేదు నిజాలను నిలదీసింది. దీనికి భిన్నంగా, రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘షోర్ ఇన్ ది సిటీ’ ముంబైలోని నేర ప్రపంచం, సామాన్యుల ఆశయాలు, మనుగడ కోసం పడే ఆరాటాన్ని గ్రిప్పింగ్‌గా చూపించింది. మరో ముఖ్యమైన చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, 1970ల నాటి ముంబై అండర్ వరల్డ్ తీరుతెన్నులను, గ్యాంగ్‌స్టర్ల మధ్య నడిచిన ఆధిపత్య పోరాటాన్ని చూపించింది.
యువత కలలు.. కీలక ఎన్‌కౌంటర్లు
అయాన్ ముఖర్జీ రూపొందించిన ‘వేక్ అప్ సిద్’ చిత్రంలో ముంబై నగరం ఒక అందమైన కలల ప్రపంచంలా కనిపిస్తుంది. మెరైన్ డ్రైవ్, ముంబై వర్షాలు, కెరీర్ కోసం నగరానికి వచ్చే యువత ఆలోచనలను ఈ సినిమా ఎంతో ఆహ్లాదకరంగా చూపించింది. ముఖ్యంగా ముంబై నగరాన్ని చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా అపూర్వ లాఖియా తెరకెక్కించిన ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’ చిత్రం 1991లో ముంబై పోలీసులకు, మాయా డోలాస్ గ్యాంగ్‌కు మధ్య లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ ఆధారంగా రూపొందింది. ఇది ముంబైలోని క్రైమ్ హిస్టరీని కళ్లకు కడుతుంది.
ఇది కూడా చదవండి: తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు!


