ఆ ఇద్దరి నటన చూసి కన్నీళ్లొచ్చాయి: మోహన్‌బాబు | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి నటన చూసి కన్నీళ్లొచ్చాయి: మోహన్‌బాబు

Published Tue, Mar 16 2021 4:06 AM

Mohan Babu Emotional Speech At Mosagallu Movie Pre Release Event - Sakshi

‘‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మోసపోతారు. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను మోసపోయాను?’ అని నా భార్య (నిర్మల) నాతో చెప్పింది (నవ్వుతూ...). ఆ మాట ఎందుకు అన్నదో నాకు అర్థం కాలేదు. ఆమె నన్ను మోసం చేసిందో... నేను ఆమెను మోసం చేశానో లక్ష్మి, విష్ణు, మనోజ్‌లకే తెలియాలి’’ అని నటుడు మంచు మోహన్‌బాబు సరదాగా అన్నారు. విష్ణు, కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘సునీల్‌ శెట్టి అద్భుతమైన నటుడు. ‘మోసగాళ్ళు’లో కూడా బాగా నటించారు. కాజల్‌ మంచి నటి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఈ చిత్రంలో విష్ణుకి అక్కగా చేసినందుకు కాజల్‌ని అభినందిస్తున్నాను.

హీరోయిన్‌గా ఉన్న నువ్వు అక్క పాత్ర చేయడం గ్రేట్‌. జానపద గాయని కోమలికి మన తర్వాతి సినిమాలో పాడే అవకాశం ఇద్దామని విష్ణు చెప్పాడు. కచ్చితంగా ఆ అవకాశం ఇస్తాను. రానాని చూస్తే ‘బాహుబలి’ గుర్తొస్తుంది. తను మంచి నటుడు. రానా నిర్మాతగా త్వరలోనే నాతో సినిమా చేస్తున్నాడు. ‘మోసగాళ్ళు’ అద్భుతమైన కథ. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమిది. ధైర్యం చేసి ఈ సినిమా తీశాడు విష్ణు. ఈ చిత్రంలో కాజల్‌– విష్ణు మధ్య సీన్స్‌ చూసి కన్నీళ్లొచ్చాయి. ఒళ్లు జలదరించింది. ఫ్యామిలీ, సెంటిమెంట్, అర్థం, పరమార్థం ఉన్న ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని మహిళలు, యూత్‌తో పాటు అందరూ చూడొచ్చు. మార్చి 19న నా పుట్టినరోజు. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాడు విష్ణు’’ అన్నారు. 

సునీల్‌ శెట్టి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారు ఒక నటుడిగా, ఫ్రెండ్‌గా నాకెంతో ఇష్టం. ఆయన ఫ్యామిలీతో నటించడమంటే నా కల నెరవేరినట్టుంది. ‘మోసగాళ్ళు’ కథ అందరి హృదయాలకు బాగా దగ్గరైంది.. అందుకే ఎంతో మనసు పెట్టి చేశాం. ప్రతి రోజూ మధ్నాహ్నం మోహన్‌బాబుగారి ఇంటి నుంచి వచ్చే భోజనం తిని నా బరువు కూడా పెరిగాను. ఆయన శ్రీమతిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. 

హీరో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే మా సినిమా చేసిన సునీల్‌ శెట్టికి, మెయిన్‌ స్ట్రీమ్‌ హీరోయిన్‌గా ఉంటూ నా అక్క పాత్ర చేసిన కాజల్‌కు, నవదీప్, ఎడిటర్‌ గౌతమ్‌రాజుగారితో పాటు సహకరించిన మొత్తం టీమ్‌కి థ్యాంక్స్‌. సునీల్‌ శెట్టిగారితో చేసిన ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారి పుట్టినరోజున ‘మోసగాళ్ళు’ విడుదలవడం నా లక్‌’’ అన్నారు. ‘‘పెళ్లి తర్వాత విడుదలవుతున్న నా తొలి చిత్రం ‘మోసగాళ్ళు’’ అన్నారు కాజల్‌. అతిథిగా వచ్చిరానా మాట్లాడుతూ– ‘‘మోహ్రా’ సినిమాలో సునీల్‌ శెట్టి కండలు చూసి 8వ తరగతిలోనే నేనూ జిమ్‌కి వెళ్లడం మొదలెట్టా. ఈ నెల 19న ఒక ప్రత్యేకమైన వ్యక్తి (మోహన్‌బాబు) పుట్టినరోజు. ఆ రోజు థియేటర్‌కి వెళ్లి ‘మోసగాళ్ళు’ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి’’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement