నాకు కొత్తగా అనిపించింది 

Mehreen Pirzada talks about her role in Spark Life and Vikranth - Sakshi

మెహరీన్‌ 

‘‘స్పార్క్‌’ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ మూవీలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతోప్రాధాన్యత ఉన్న రోల్‌ నాది. సినిమా నాతోనే ప్రారంభం అవుతుంది.. నాతోనే ముగుస్తుంది.. ఇలాంటి థ్రిల్లర్‌ మూవీలో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్‌ మెహరీన్‌ అన్నారు. విక్రాంత్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’. మెహరీన్, రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్లుగా నటించారు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రోడక్షన్సపై లీల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్‌ పంచుకున్న విశేషాల..

► కొత్తవాళ్లు, అనుభవం ఉన్న నటీనటులతో పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ‘స్పార్క్‌’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్‌ ఓ రోజు ఫోన్‌ చేసి, ‘మీతో కలిసి నటించాల నుంది’ అన్నారు. కథ నాకు నచ్చడంతో ఓకే చెప్పాను. విక్రాంత్‌గారు ఈ మూవీ కోసం చేసిన పరిశోధన నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్‌ కొత్తగా ఉంటుందని చెప్పారు.. నా లుక్, పాటలు తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. విక్రాంత్‌ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని నాకు అర్థమైంది. లీల గారు ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీ తీశారు. 

► విక్రాంత్‌ అమెరికాలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. అయితే సినిమా చేయాలనే కలని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. అమెరికాలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘స్పార్క్‌’ కథను తయారు చేసుకున్నారు విక్రాంత్‌. ఈ కథకి కమర్షియల్‌ అంశాలు జోడించి థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కించారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్‌ చేయటం ఎంతో కష్టం. కానీ, విక్రాంత్‌ ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. తను ఓ డెబ్యూ హీరోగా, డెబ్యూ డైరెక్టర్‌గా మెప్పిస్తాడు. 

►జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదగాలని ప్రతి మనిషి కలలు కంటుంటారు.. నేను కూడా అంతే. నా కలలను నిజం చేసుకునే క్రమంలోనే ముందుకు వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది.. అందుకే ఈ పాత్రకు నేను కనెక్ట్‌ అయ్యాను. నటిగా ప్రతి సినిమా నాకెంతో ప్రత్యేకమైనదే. కథ, నా పాత్ర నచ్చితేనే చేస్తాను.. లేకుంటే చేయను. అది నా కెరీర్‌కి ఎంతో సాయపడుతోంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాలో స్ఫూర్తి నింపుతుంటారు. పాత్ర ఏదైనా నటిగా రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. ∙నేను ఏదైనా వేడుకలకి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్లో ఉన్నప్పుడు ఎవరైనా నేను చేసిన పాత్ర పేరుతో పిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ నా తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లోని మహాలక్ష్మి పాత్ర పేరుతో పిలుస్తుండటం హ్యాపీ.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top