టైటిల్: మయూఖ
నటీనటులు: పాయల్ చెంగప్ప, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బారా, అమన్ మసూద్ తదితరులు
నిర్మాత: శశిధర్ నల్ల
దర్శకుడు: శ్రీ తేజ్ ఎస్కే (శ్రీకాంత్ కండ్రేగుల)
సంగీతం: సిబి మాథ్యూ అలెక్స్
ఎడిటర్: శరత్ జె
విడుదల తేది: అక్టోబర్ 9, 2026
విడుదలకు ముందే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ మిస్టరీ మూవీ అవార్డును(థ్రిల్లర్ కేటగిరీలో రెండో ఉత్తమ చిత్రంగా నిలిచింది) అందుకున్న చిత్రం ‘మయూఖ’. సాధారణంగా విడుదలైన తర్వాత సినిమాలకు అవార్డులు రావడం చూస్తుంటాం. కానీ, విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం అంటే చిన్న విషయం కాదు. అసలు ఈ సినిమాలో అంత ప్రత్యేకత ఏముంది? ప్రేక్షకులను ఆకట్టుకునే మిస్టరీ ఏంటి? ఈ థ్రిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
మయూఖ (పాయల్ చెంగప్ప) సింగిల్ గా ఉంటూ ఒక బ్యాంకు లో పని చేస్తుంది. ఆమెకు కొంచెం భయం ఎక్కువ. తను ఉండే ఫ్లాట్ లోకి ఒక అపరిచ వ్యక్తి వచ్చి వెళ్తుంటాడు. తనను ఎవరో ఫాలో అవుతున్నారు అని...గదిలోకి వచ్చి వెళ్తున్నారని పోలీసులకి చెప్తే నమ్మరు. ఆధారాలు అడుగుతుంటారు. అదే సమయంలో సిటీలో వరుస హత్యలు జరుగుతుంటాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాచ్ మెన్ నుంచి ఓనర్ వరకు ప్రతి ఒక్కరిని మయూఖ అనుమానస్తుంది. సీసీ కెమెరాలను పరిశీలిస్తే..తన సహోద్యోగి వచ్చివెళ్లినట్లుగా తెలుస్తుంది. అదే రోజు అతని మయూఖ దగ్గరకు వస్తాడు. గది ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టగానే..భయంతో డోర్ ఓపెన్ చేస్తుంది. అతను ఇంట్లోకి రాగానే డోర్ లాక్ చేసి పోలీసులకు ఫోన్ చేస్తుంది. వాళ్లు వచ్చి చూసేసరికి అతను చనిపోతాడు. దీంతో మయుఖను పోలీసులు అరెస్ట్ చేస్తారు. విచారణలో ఆమె హత్య చేయలేదని తేలుతుంది. మరి ఆ హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? మయుఖను భయపెడుతున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? నిజంగానే ఆమె గదిలో మరో వ్యక్తి ఉన్నాడా లేడా? చివరకు పోలీసులు ఈ కేసును ఎలా చేధించారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మిస్టరీ థ్రిల్లర్ అంటే ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ, తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తిని కలిగించాలి. ముఖ్యంగా ట్విస్టులను ముందే ఊహించలేకుండా కథనం సాగాలి. ‘మయూఖ’ కూడా అలాంటి సైకో కిల్లర్ థ్రిల్లర్ చిత్రం.ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, టాలీవుడ్‌లో తొలిసారిగా ‘ఫ్రాంగింగ్’ అనే కొత్త పాయింట్‌ను కథకు ఆధారంగా తీసుకుని దర్శకుడు శ్రీతేజ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ హత్య సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మయుఖ నేపథ్యం..ఆమె గదిలోకి ఓ వ్యక్తి వెళ్లడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆమె గదిలో నిజంగానే ఓ వ్యక్తి వచ్చివెళ్తున్నాడా? లేదా ఆమె ఊహించుకుంటుందా? ఒకవేళ నిజంగానే వస్తే..అతను ఎవరు? అతని లక్ష్యం ఏమై ఉంటుంది? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతంది.
ఫస్టాఫ్ అంతా అసలు ఏం జరుగుతోంది? నిజంగానే అక్కడ ఎవరైనా ఉన్నారా? లేక ఇదంతా మయూఖకు కలుగుతున్న భ్రమేనా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో కలుగుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూనే ప్రేక్షకులు కథలో లీనమవుతారు. సెకండాఫ్‌లో దర్శకుడు ఒక్కో చిక్కుముడిని విప్పుతూ కథను ముందుకు తీసుకెళ్తాడు. అనుమానాలు ఒక్కొక్కరి మీదకు మళ్లుతూ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చివరి అరగంట సినిమా మరింత ఆసక్తికరంగా సాగుతుంది.అయితే సైకో కిల్లర్ నేపథ్యం తెలియగానే..తర్వాత ఏం జరుగుతందనేది ముందుగానే ఊహించొచ్చు. అయినా కూడా కొన్ని సన్నివేశాలు భయపెడతాయి. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
మయూఖ పాత్రలో పాయల్ చెంగప్ప న్యాయం చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతంది. బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ అమన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బారాతో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా సిబి మాథ్యూ అలెక్స్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


