
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే తాజాగా సోనీ లివ్ లోకి వచ్చిన డార్క్ కామెడీ మూవీ 'మరణమాస్'. మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శవంతో కామెడీ చేయడం క్రేజీ అనే చెప్పొచ్చు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? దీని సంగతేంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)
కథేంటి?
ముసలివాళ్లని మాత్రమే టార్గెట్ చేసే సీరియల్ కిల్లర్.. వారిని చంపేసి, నోటిలో అరటిపండు పెట్టి వెళ్లిపోతుంటాడు. అదే ఊరిలో ఉంటున్న ల్యూక్ (బాసిల్ జోసెఫ్).. బనానా కిల్లర్ అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. జెస్సీ(అనీష్మా) అనే అమ్మాయిని ల్యూక్ ప్రేమిస్తుంటాడు. ఓ రోజు జెస్సీ బస్సులో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఓ ముసలివాడు ఈమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. కోపమొచ్చి అతడి ముఖంపై పెప్పర్ స్ప్రే కొడుతుంది. దీంతో చనిపోతాడు. అదే టైంకి ల్యూక్.. జెస్సీ కోసం బస్సు ఎక్కుతాడు. వీళ్లతో పాటే సదరు సీరియల్ కిల్లర్ కూడా బస్సులోనే ఉంటాడు. మరి సీరియల్ కిల్లర్ గురించి జెస్సీ, ల్యూక్ కి తెలిసిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
మన దగ్గర కొందరు దర్శకులు.. తీసిన కథలతోనే సినిమాలు తీసి తీసి ప్రేక్షకులకు చిరాకొచ్చేలా చేస్తుంటారు. ఏమంటే స్టోరీల్లేవు అని అంటుంటారు. అదే మలయాళంలో మాత్రం చాలా చిన్న పాయింట్ తీసుకుని వాటితో ఏకంగా మూవీస్ తీసేస్తుంటారు. అలా తీసిన చిత్రమే ఇది.
మసలివాళ్లని మాత్రమే చంపి, వాళ్ల నోటిలో అరటిపండు పెట్టే సీరియల్ కిల్లర్. సినిమా మొదట్లోనే ఇతడెవరో చూపించేస్తారు. మరోవైపు హీరోహీరోయిన్ ప్రేమకథ, ఇంకోవైపు బస్సు డ్రైవర్, కండక్టర్ స్టోరీలు. దీనికి తోడు ఓ శవం. అసలు ఓ మనిషి చనిపోయాడని బయటకు తెలియకుండా ఉండేందుకు ఈ ఐదుగురు ఎలాంటి పాట్లు పడ్డారు. ఎలా నవ్వించారనేదే స్టోరీ.
ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని పాత్రల్ని తీసుకొచ్చి ఓ వృద్ధుడి మరణంతో లింక్ చేయడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరీ పగలబడి నవ్వేంత సీన్లు అయితే ఉండవు కానీ టైమ్ పాస్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు సినిమా అలా నడిచేస్తూ ఉంటుంది. బనానా కిల్లర్ ఎందుకు ముసలి వాళ్లని మాత్రమే చంపుతున్నాడనే విషయాన్ని చివర్లో రివీల్ చేస్తారు గానీ అదేమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.
శవంతో కామెడీ చేయడం ఏంటా అనిపిస్తుంది గానీ సినిమా చూస్తున్నప్పుడు అదేమంత ఇబ్బందిగా అనిపించదు. చివరలో ఓ ట్విస్ట్‌తో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. కథను కామెడీగా చెప్పినప్పటికీ.. అంతర్లీనంగా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయిల ఆత్మరక్షణ లాంటి అంశాలు కూడా ఆలోచించేలా చేస్తాయి.
ఎవరెలా చేశారు?
డబ్బింగ్ చిత్రాలతో మనకు బాగా పరిచయమైన బాసిల్ జోసెఫ్.. ఎప్పటిలానే మరో డిఫరెంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. జట్టుకి కలర్ తో భలే వెరైటీగా కనిపిస్తాడు. హీరోయిన్ గా చేసిన అనీష్మా, సీరియల్ కిల్లర్ గా చేసిన శ్రీకుమార్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే.
టెక్నికల్ గానూ సినిమా బాగుంది. పాటలేం లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సింపుల్ పాయింట్ ని వీలైనంత ఫన్నీగా తీయడానికి దర్శకుడు కష్టపడ్డాడు. ఈ ప్రయత్నంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు. ఈ వీకెండ్ ఏదైనా కాస్త ఫన్, కాస్త థ్రిల్ ఉండే మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సోనీ లివ్ లో ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులో ఉంది.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్)