బిగ్‌బాస్: నాగ్‌ వెనుక స్టైలిష్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌

manogna Fashion Designer For Nagarjuna To Bigg Boss - Sakshi

బిగ్‌బాస్‌–4లో సరికొత్తగా కనిపిస్తున్న నాగార్జున 

క్యాజువల్‌ అండ్‌ క్లాసిక్‌ లుక్‌తో కనువిందు 

వారం వారం నాగ్‌ను కొత్తగా చూపిస్తున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ మనోజ్ఞ

మనోజ్ఞంగా..  బాస్‌ బ్యూటీ!

అక్కినేని నాగార్జున. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఆయనలోని అందం, స్టైల్‌. ఆయన నడిచినా, నిలబడినా, మాట్లాడుతున్నా..అంతా స్టైల్‌గానే ఉంటుంది. ఆ స్టైల్‌కి 1990లోనే అమ్మాయిలంతా ఫిదా అవ్వగా..నేటితరం అమ్మాయిలూ ‘అరే నాగ్‌ భలే ఉన్నాడే’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు విసురుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌–4 హోస్ట్‌గా చేస్తున్న నాగ్‌ సరికొత్తగా బుల్లితెరపై మెరుపులు మెరిపిస్తున్నాడు. క్యాజువల్‌ అండ్‌ క్లాసిక్‌ లుక్‌లో వారం వారం తన అభిమానులతో పాటు, అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాడు. నాగ్‌ అంత స్టైలిష్‌గా ఉండటానికి, ఆయనని అంత స్టైలిష్‌గా తీర్చిదిద్దడం వెనుక స్టైలిష్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ ‘మనోజ్ఞఆవునూరి’ కృషి ఎంతో ఉంది. చిన్న వయసులోనే మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున లాంటి వారికి ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేసిన ఆమె తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

బుల్లితెరపై బిగ్‌బాస్‌– 4ను తిలకిస్తున్నారా? అందులో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్‌ నటుడు నాగార్జునను గమనించారా? ఆయన ఇదివరటికన్నా మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు కదూ. దీని వెనుక యువ డిజైనర్‌ ఆవునూరి మనోజ్ఞ ఘనత ఉంది. నాగ్‌ మరింత స్టైలిష్‌గా కనిపించేలా.. ఆయన లుక్‌ తళుక్కుమనేలా ఆమె తపిస్తోంది. తెర వెనక ఉండి అందరి ప్రశంసలను అందుకుంటోంది. మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున లాంటి వారికి స్టైలిష్, ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేయగలిగే స్థాయికి ఎదిగింది.  – చైతన్య వంపుగాని 

నిజామాబాద్‌కు చెందిన మనోజ్ఞ ఆవునూరి ముంబైలోని ‘నిఫ్ట్‌’ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌లో ‘మాస్టర్స్‌ ఇన్‌ డిజైనింగ్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌’ కోర్సు పూర్తి చేసింది. నాగార్జున స్టైలిష్, ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్న పల్లవి ద్వారా ఈ అవకాశాన్ని ఆమె సొంతం చేసుకుంది. సైరా మూవీ, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ లాంటి వాటికి ఇటు చిరంజీవి, అటు నాగార్జునలకు స్టైలిష్‌గా వ్యవహరించారు మనోజ్ఞ.  

చిరు టు నాగ్‌ 
‘సైరా నరసింహారెడ్డి’ మూవీకి సైతం చిరంజీవికి స్టైలిష్, ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేసింది మనోజ్ఞ. చిరంజీవి కుమార్తె సుస్మితతో కలిసి మనోజ్ఞ డిజైనింగ్‌ అండ్‌ స్టైలిష్‌గా చేశారు. చిరు ధరించిన దుస్తులు, లుక్స్‌ యావత్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా సైరా నుంచి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ యాడ్‌లో నాగ్‌కు స్టైలిష్‌గా చేసేందుకు నాగ్‌ స్టైలిష్, డిజైనర్‌ పల్లవి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశమే ఆమెను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తోంది.  

క్యాజువల్‌ అండ్‌ క్లాసిక్‌ లుక్‌లో..  
బుల్లితెరపై నాగార్జున సందడిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్‌బాస్‌–3తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన నాగ్‌ బిగ్‌బాస్‌– 4తో మరింత మందికి చేరువయ్యా రు. నాగార్జున సినిమాలో కనిపించినా, బయట కనిపించినా ఎప్పుడూ ఆయన ఫిజిక్, డ్రెస్సింగ్, స్టైలిష్‌ గురించే మాట్లాకుంటుంటారు. బిగ్‌బాస్‌– 4 సీజన్‌లో నాగ్‌ కొత్తగా చూపించేందుకు మనోజ్ఞ ఓ అడుగు ముందుకేశారు.

షాపింగ్‌ మాల్‌ నుంచి బిగ్‌బాస్‌ దాకా.. 
సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అందులో వస్తున్న అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కూడా మంచి యంగ్‌ లుక్‌తో కనివిందు చేస్తున్నారు. యంగ్‌ లుక్‌లో టీ షర్ట్, ట్రజర్‌తో, కార్పొరేట్‌ లుక్‌ కోసం సూట్‌లో, పెళి, ఇతర శుభకార్యాలయాల లుక్‌ కోసం పైజామా, కుర్తా, షేర్వాణీ వంటి వాటిలో హుందాగా కనిపిస్తూ అందరికీ కనెక్ట్‌ అవుతున్నారంటే దానికి కారణం మనోజ్ఞయే.  

మామ, కోడల్ని హ్యాండ్లింగ్‌ చేస్తూ.. 
ఓ పక్క నాగ్‌ని, మరో పక్క ఆయన కోడలు సమంత అక్కినేనిని హ్యాండిల్‌ చేస్తోంది మనోజ్ఞ. దసరా రోజు ఎపిసోడ్‌కు నాగార్జున షూటింగ్‌లో ఉన్నందున రాలేకపోయాడు. ఆ ఎపిసోడ్‌ను ఆయన కోడలు సమంత చేసింది. వింటేజ్‌ లుక్‌లో సమంతను సరికొత్తగా చూపించింది. ఇలా ఓ పక్క మామని, మరో పక్క కోడల్ని హ్యాండిల్‌ చేస్తూ.. అందరి మన్ననలు సొంతం చేసుకుంది మనోజ్ఞ ఆవునూరి.

కాన్ఫిడెన్స్‌తోనే సాధించగలం..  
పెద్ద పెద్ద స్టార్స్‌కి స్టైలిష్, డిజైనింగ్‌ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. ఆ అవకాశం రావాలి అంటే మనం ఎంతో కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్లాలి. ప్యాషన్‌తో ఉంటూ, మన పనిలో డెడికేషన్‌ కనిపిస్తే అవకాశాలు వస్తుంటాయి. నాగ్‌ సార్‌ మంచి స్టైలిష్‌గా ఉంటారు. కానీ.. ఆయన్ని మరింత స్టైలిష్‌గా చూపించాలంటే చాలా కేర్‌ తీసుకోవాలి, దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. మేం చెప్పింది ఆయన ఒప్పుకోవాలి. ఆయన మనసులో ఉన్నదానికి అనుగుణంగా మేం ముందుకు వెళ్లాలి. బిగ్‌బాస్‌– 4 సీజన్‌ను క్లాసిక్‌ అండ్‌ క్యాజువల్‌ లుక్‌లో చూపిద్దామని చెప్పగానే ఆయన ఓకే అనేశారు. అందుకే ప్రతి ఎపిసోడ్‌లో నాగ్‌ సార్‌ని సరికొత్తగా, గ్లామరస్‌గా చూపించడంలో సక్సెస్‌ అయ్యా. – మనోజ్ఞ ఆవునూరి, స్లైలిస్ట్, ఫ్యాషన్‌ డిజైనర్‌
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top