మా ఇద్దరికీ సంక్రాంతి కలిసొచ్చిన పండగ | Sakshi
Sakshi News home page

మా ఇద్దరికీ సంక్రాంతి కలిసొచ్చిన పండగ

Published Wed, Jan 10 2024 1:52 AM

Mahesh Babu: Guntur Karam pre release event in Guntur - Sakshi

‘‘నాన్నగారికి (సూపర్‌ స్టార్‌ కృష్ణ), నాకు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజైతే అది బ్లాక్‌బస్టరే.. ఈసారి కూడా ‘గుంటూరు కారం’తో బాగా గట్టిగా కొడతాం. కానీ, ఈసారి కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు. ఆయన నా సినిమా చూసి కలెక్షన్స్, సినిమా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఆయన ఫోన్‌ కోసం ఎదురు చూసేవాణ్ణి.

ఇప్పుడు అవన్నీ మీరే (ఫ్యాన్స్‌) చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మానాన్న.. మీరే అన్నీ (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, శ్రీలీల జంటగా మీనాక్షీ చౌదరి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. మమత సమర్పణలో ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో

మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘నేను త్రివిక్రమ్‌ గారి సినిమాలు చేసినప్పుడల్లా నా నటనలో ఒక మ్యాజిక్‌ జరుగుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాలకు మ్యాజిక్‌ జరిగింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ ఆ మ్యాజిక్‌ జరిగింది. ఒక కొత్త మహేశ్‌బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. మా నిర్మాత చినబాబుగారికి అత్యంత ఇష్టమైన హీరో నేనే. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో వచ్చిన సంతోషం చూసినప్పుడు నాకు ఆనందంగా అనిపించేది.

శ్రీలీలతో డ్యాన్స్‌ చేయడమంటే వామ్మో.. అదేం డ్యాన్సు.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది (నవ్వుతూ). తమన్‌ ప్రతిసారీ నాకు బెస్ట్‌ ఇస్తాడు. ‘కుర్చీ మడతపెట్టి..’ పాట చూస్తే థియేటర్లు బద్దలయిపోతాయి. పాతికేళ్లుగా మీరు (ఫ్యాన్స్‌) చూపించిన అభిమానం మరచిపోలేను. మాటల్లేవ్‌.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకేమీ తెలియదు.. మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు’’ అన్నారు.

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ –‘‘కృష్ణగారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి గొప్ప మహానటుడు, మహా మనిషితో నేను నేరుగా పని చేయలేకపోయాను. కానీ, ఆయన పని చేసిన ఓ సినిమాకి పోసానిగారి వద్ద అసిస్టెంట్‌గా చేశాను. ఆ తర్వాత ‘అతడు, ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడాను. అలాంటి గొప్ప వ్యక్తికి కొడుకుగా పుట్టిన మహేశ్‌గారు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంటుంది.

ఒక సినిమాకి 100 శాతం పని చేయాలంటే 200 శాతం పని చేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేశ్‌గారే.. ఈ మాట చెప్పడానికి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడరు. ‘అతడు, ఖలేజా’లకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అది అందం పరంగా, నటన పరంగానూ. ఈ సంక్రాంతిని రమణగాడితో కలిసి థియేటర్లలో ఆనందంగా జరుపుకుందాం’’ అన్నారు.

నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘చినబాబు, నాగవంశీల సక్సెస్‌ జర్నీ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్‌ ప్రతి సినిమాలో ఏదో మాయ చేస్తారు.. ఈ సినిమాలో కూడా చేశారు. ‘గుంటూరు కారం’తో మహేశ్‌గారు కలెక్షన్ల తాట తీస్తారు. బ్లాక్‌ బస్టర్‌ సినిమా రాబోతోంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement