Madhuvidhu: ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా? | Madhuvidhu Movie Story, OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Madhuvidhu Review: ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా?

Jun 3 2026 4:47 PM | Updated on Jun 3 2026 5:00 PM

Madhuvidhu Movie Story, OTT Streaming Details

పెళ్ళి అనేది కొన్ని కుటుంబాలతో పాటు తరాలను కలుపుతుంది. అందుకే అంటారు మన పెద్ద వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు తరాలు చూసి సంబంధం కలుపుకోమని. అలా అనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పెళ్ళి సాంప్రదాయాలను పద్ధతిగా పాటిస్తుంటారు. పద్ధతిగానే కాదు కొంతమంది మూర్ఖంగా కూడా పాటిస్తుంటారు. ఆ అంశంతోనే రూపుదిద్దుకున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా మధవిధు.

జై విష్ణు, బిబిన్ మోహన్ అందించిన కథకు విష్ణు ఆనంద్ తెర కెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పాలి. మధువిదు సినిమా మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.

ఆంజిల్ ముట్టిల్ కుటుంబంలో పెద్దవాడైన అమృతరాజ్ ఓ కేప్ నడుపుతూ ఉంటాడు. వయసు పైబడినా ఇంకా అమృతరాజ్ కు పెళ్ళవదు. అందుకే అమృతరాజ్ తన పెళ్ళి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటాడు. అమృతరాజ్ ఇంట్లో తమ్ముడితో సహా తన తండ్రి, తాతతోపాటు బాబాయ్ ఉంటారు. అమృతరాజ్ తల్లి చిన్నపుడే చనిపోతుంది. ఒక్క ఆడ దిక్కులేని ఈ కుటుంబానికి ఊళ్ళో వాళ్ళు అనే మాటల వల్ల పెళ్ళి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. ఆంజిల్ ముట్టిల్ కుటుంబానికి తరతరాల నుండి ఏదో ఆడశాపం ఉందని వినికిడి. 

దీంతో బాగా దిగాలు పడిన అమృతరాజ్ ఎట్టకేలకు స్నేహ అనే అమ్మాయిని ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి అందరితో కలిసి స్నేహ వాళ్లింటికి వెళతారు. పేరుకు అమృతరాజ్ పెళ్ళి చూపులైనా అమృతరాజ్ తండ్రి స్నేహ అత్తను గుర్తుపట్టి, ఇష్టపడి తరువాత ఎవరికీ చెప్పకుండా లేచిపోయి పెళ్ళి చేసుకుంటాడు. ఇక అక్కడి నుండి అమృతరాజ్ వెళ్ళి కథ మళ్ళీ మొదటికొస్తుంది. 

దీంతో మళ్ళీ అమృతరాజ్ నానా తంటాలు పడుతూ స్నేహ వాళ్ళ నాన్నను పెళ్ళి కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో స్నేహ చెల్లెలు సోఫీ పెళ్ళి ఖాయమవుతుంది. కాని రేపు పెళ్ళి అనగా అబ్బాయి తనకు ఇష్టం లేదని సోఫీ అమృతరాజ్ కి మాత్రం తెలియచేస్తుంది. మరి సోఫీ పెళ్ళి ఆపించి తన పెళ్ళి జరిగేలా అమృతరాజ్ చేయగలడా లేదా అన్నది మాత్రం మధువిధు సినిమాలోనే చూడాలి. అవడడానికి ఇది మళయాళ సినిమా అయినా సోనీలివ్ ఓటిటి వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. సినిమా ఆద్యంతం నవ్వులతో సరదాగా సాగిపోతుంది. మస్ట వాచ్ ఫర్ ది వీకెండ్.
– హరికృష్ణ ఇంటూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement