MAA Elections 2021 Live Updates: ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్‌

MAA Elections 2021 Live Updates - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు  665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ‘మా’చరిత్రలోనే రికార్డు స్థాయిలో 83 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది.‘మా’లో మొత్తం 925 మంది సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

2:20 PM
 మా చరిత్రలో రికార్డ్ స్థాయి  పోలింగ్
‘మా’ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్‌ జరిగింది. గతేడాది కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ సారి మాత్రం ఇప్పటికే 545 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్‌ సమయాన్ని మరో గంట పొడిగించడంతో మరింతమంది తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానుంది. అర్థరాత్రి దాటిన తర్వాతే ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

2:05 PM
ఓటేసిన అఖిల్‌
‘మా’ఎన్నికల్లో యంగ్‌ హీరో అఖిల్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయనతో పాటు హీరో సుధీర్‌ బాబు, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకేసారి యంగ్‌ హీరోలంతా రావడంతో వారితో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. 

1:55 PM
‘మా’పోలింగ్‌ మరో గంట పొడిగింపు
‘మా’ఎన్నికల పోలింగ్‌ని మరో గంట పొడిగించారు. వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్‌  ముగియాలి. కానీ ఓటు వేసే వాళ్లు చాలా మంది ఉండండంతో పోలింగ్‌ని మరో గంట పొడిగించినట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ తెలిపారు. ఇరు ప్యానళ్లతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్‌ మధ్నాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.

1:40 PM
విష్ణు గెలుపు ఖాయం : నరేశ్‌

‘మా’ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధిస్తాడని నటుడు నరేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఓటు రెండేళ్ల పాలనకు పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు కుక్కల్లా అరిచారని, ఇవి వారి నోళ్లు మూయించే ఎన్నికలని తెలిపిన నరేశ్‌.. కచ్చితంగా మంచు విష్ణుదే విజయమని తేల్చి చెప్పారు.

1:15 PM
మధ్నాహ్నం ఒంటి గంట వరకు 450 ఓట్లు పోలైయ్యాయి. హీరో నాని సైతం తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. 

1:05 PM
తెలుగు కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వండి: ఆర్‌ నారాయణ మూర్తి
సినీ నటుడు, దర్శకుడు ఆర్‌ నారాయణ మూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి వాళ్లు జాతీయ స్థాయి సినిమాలు తీయడం సంతోషించాల్సిన విషయమని, సినిమాల్లో తెలుగు కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

12:40 PM
ఓటేసిన నాగార్జున
అక్కినేని నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నాగ్‌తో పాటు కమెడియన్‌ పృథ్విరాజ్‌ కూడా మధ్యాహ్నం 12:40 గంటలకు పోలింగ్‌ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. కాగా, చిరంజీవి, బాలకృష్ణ, మురళీ మోహన్‌ తదితర సీనియర్‌ హీరోలు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, వెంకటేశ్‌, నాని, నాగచైతన్య లాంటి అగ్రహీరోలు ఇప్పటి వరకు తమ ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. 

12:26 PM
‘మా’ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. 

12:10 PM
అందుకే శివబాలాజీ చేయి కొరికా : హేమ
శివబాలజీ చేయిని కోరకడంపై  హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ  చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.

11:45 AM
‘మా’లో పోటీ నాతోనే మొదలైంది: రాజేంద్రప్రసాద్‌
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా’లో పోటీ తనతోనే మొదలైందన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. వాళ్లు తమలో ఒకరేనన్నారు. ‘మా’కు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

11:25 AM
11 గంటల వరకు ఎంతమంది ఓటు వేశారంటే..
మా ఎన్నికల్లో పోలింగ్‌ కొనసాగుతుంది. చిన్న చిన్న వివాదాలు మినహా.. పోలింగ్‌ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు  287 ఓట్లు పోలైయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. 

11:10 AM
టాలీవుడ్‌ నా సొంతిల్లు: జెనీలియా
‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నటి జెనీలియా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నుంచి వచ్చి మరీ ఓటు వేశారు. అనంతరం ఆమెమాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ నాకు సొంతిల్లు అని తెలిపారు. ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తే గెలుస్తారని తెలిపారు. త్వరలోనే సూపర్‌ ప్రెసిడెంట్‌ను చూస్తామన్నారు.

10:35 AM
అందరం ఒకే కుటుంబానికి చెందినవాళ్లం: ఆర్కే రోజా
ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. ఈ సారి ఎన్నకల్లో ఎన్నో వివాదాలు తెరపై వచ్చాయి. ఇందులో ఉంది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలని, సమస్యలను ఇరూ రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లాలి. రెండు ప్యానల్లో నాతో పని చేసిన వారె ఉన్నారు. చివరికి అందరం కలిసి కట్టుగా ఉంటాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కేంద్రానికి నటి జెనిలీయా చేరకున్నారు. ఈ సందర్భంగా విష్ణు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి జెనిలీయాను లోపలికి తీసుకెళ్లాడు.

10:20 AM
మా ఎన్నికల్లో మరోసారి రసాభాస మొదలైంది. ఎన్నికల కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెళ్ల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే మోహన్‌ బాబు కోపంతో ఊగిపోయారు. పోలింగ్ సెంటర్‌లో ప్రచారం చేయడానికి ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

10:00 AM
మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారే
‘మా’అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌ రాజ్‌, విష్ణు అన్నదమ్ముల్లాంటి వారని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్‌ రాజ్‌, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్‌లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు. 

9:30AM
ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి
‘మా’ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సినీ పెద్దలు క్యూ కడుతున్నారు. ‘మా’ఎన్నికల్లో మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ  ఓటు హక్కును వినియోగించున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా ప్రకాశ్‌ రాజ్‌కే మద్దతు ఇస్తున్నారు కదా విలేకర్లు ప్రశ్నించగా, అలాంటిదేమి లేదని చిరంజీవి అన్నారు. ఓటర్లు ఎవరిని గెలిపిస్తే వారికే తన మద్దతు ఉంటుందన్నారు. 

9:10 AM
నేను కూడా పోటీ చేయాలనున్నా: సాయి కుమార్‌
మా అధ్యక్ష పదవి కోసం కొనసాగుతోన్న ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు సాయి కుమార్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా పోటీ చేయాలనుకున్నానని, కానీ షూటింగ్‌లో బిజీ ఉండడంతో పోటీలో లేనని చెప్పుకొచ్చాడు.తాను లోకల్‌, నాన్‌ లోకల్‌ కాదని నేషనలిస్ట్‌ అని తెలిపాడు.

9:05AM
ఓటు హక్కు వినియోగించుకున్న రామ్‌ చరణ్‌
మా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌. ఆయనతో పాటు మంచు లక్ష్మీ, శ్రీకాంత్‌, సుమ, సుడిగాలి సుధీర్‌, ఉత్తేజ్‌, సాయి వెంకట్‌, వేణు, ఈటీవీ ప్రభాకర్‌, మురళీమోహన్ తదితరులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

9:00AM
మా ప్యానల్‌దే గెలుపు : మంచు విష్ణు
‘మా’ ఎన్నికల్లో మా ప్యానల్‌దే గెలుపు అన్నారు మంచు విష్ణు. సినీ పెద్దల ఆశీర్వాదాలు తమకే ఉన్నాయన్నాని చెప్పారు. ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆయన పెద్దరికాన్ని గౌరవించి తానేమి అనలేదని, తన విజ్ఞతకే వాటిని వదిలేస్తున్నానని చెప్పారు. 

8:50 AM
 ‘మా’ పోలింగ్‌ వద్ద ఉద్రిక్తత
‘మా’పోలింగ్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌ ఫ్యానల్‌ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్‌ మెంబర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్‌ ఇస్తున్న శివారెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని అక్కడ నుంచి పంపించేశారు.

8:25 AM
మా ఎన్నికలు కొనసాగుతున్నాయి. తనికెళ్ల తనికెళ్ళ భరణి, రఘుబాబు, ఆకాశ్‌ పూరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

8.20 AM
వ్యక్తిగత దూషణలు అవసరమా?: పవన్‌

‘మా’పోలింగ్‌ ప్రారంభమైంది. పొసాని కృష్ణ మురళి, పవన్‌ కల్యాణ్‌ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌  మాట్లాడుతూ.. గతంలో ఇంతపోటీ నేను చూడలేదు. తిప్పికొడితే 900 ఓట్లు ఉండవు. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా’ అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు. ఇక మోహన్ బాబు వర్సెస్‌ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్నదానిపై పవన్‌ స్పందిస్తూ.. ‘వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌’ అని తెలిపారు.

7.50 AM
మంచు విష్ణును ఆలింగనం చేసుకున్న ప్రకాశ్‌రాజ్‌

మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా. కాసేపటి క్రితమే ప్రకాశ్‌ రాజ్‌ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్‌ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు అయితే మోహన్‌ బాబు దానికి నిరాకరించి ప్రకాశ్‌ రాజ్‌ను భుజం తట్టాడు. ఈ సన్నివేశం ఆసక్తిని రేకెత్తించింది.

7.45 AM
MAA Elections Voting Live Updates: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు​ హక్కును వినియోగించుకోనున్నారు.


గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని​ ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్‌ స్కూల్‌ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్‌ స్లిప్‌ తీసుకున్న తర్వాతనే ఓటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు.  

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top