
గుడ్లవల్లేరు: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ మరణవార్తతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన స్నేహితులు, గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.
సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తరచూ తాను పుట్టి, పెరిగిన ఊరికి వచ్చేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సందడి చేసేవారని చిన్ననాటి స్నేహితులు కానూరి పూల రామకృష్ణారావు, బాడిగ ఫణిభూషణరావు, కానూరి రాజేంద్రప్రసాద్‌లు చెప్పారు.
కౌతవరంలో తన తాత కంభంమెట్టు రామయ్య పేరిట ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఏర్పాటుకు కృషిచేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో సుమారు రూ.40లక్షల ప్రభుత్వ నిధులతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా చూశారు. కౌతవరం–చేవెండ్ర రోడ్డు నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు.