OTT: కృష్ణవంశీ, క్రిష్‌, విక్రమ్‌ కె. కుమార్, హను రాఘవపూడి నుంచి వస్తున్న వెబ్‌ సిరీస్‌లివే!

Krishna vamshi, Krish, Vikram k Kumar, Hanu Raghavapudi Starts on OTT Projects - Sakshi

ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే గతంలో థియేటరే.. కానీ, ప్రస్తుతం బుల్లితెర కూడా ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతోంది. పైగా కరోనా లాక్‌డౌన్‌లో ప్రేక్షకులకు ఓటీటీలు     మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అయ్యాయి.  ఇంట్లో కూర్చునే అటు సినిమాలు,  ఇటు వెబ్‌ సిరీస్‌లు, షోలు చూస్తున్నారు.

వెబ్‌ సిరీస్‌లకు ఆదరణ బాగా ఉండటంతో సినిమా దర్శకులు సైతం ‘ఓటీటీకి సై’ అంటూ డిజిటల్‌ ప్రపంచంలోకి  అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీలోకి ఎంటర్‌ కాగా తాజాగా ఈ జాబితాలోకి  కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్‌ కె. కుమార్, హను రాఘవపూడి వంటి దర్శకులు చేరారు. ఈ దర్శకుల ఓటీటీ ప్రాజెక్ట్స్‌ గురించి తెలుసుకుందాం.

ఫ్యాక్షన్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్‌ సినిమా అయినా తన మార్క్‌ చూపించారు క్రియేటివ్‌ డైరెక్టర్‌      కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తదుపరి ప్రాజెక్ట్‌గా దాదాపు    రూ. 300 కోట్లతో ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు కృష్టవంశీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్‌ సిరీస్‌గా మలచనున్నట్లు తెలిపారాయన. ఒక్కో సీజన్‌కు 10 ఎపిసోడ్స్‌ చొప్పున 5 సీజన్స్‌గా ఈ సిరీస్‌ని రూపొందించనున్నారట.

ఇక సమాజంలోని వాస్తవ అంశాలను, నవలలను, చారిత్రక అంశాలను కథలుగా మలిచి వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్‌ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఇప్పటికే ‘మస్తీస్, 9 అవర్స్‌’ వంటి వెబ్‌ సిరీస్‌లకు షో రన్నర్‌గా     వ్యవహరించిన ఆయన తొలిసారి ఓ వెబ్‌ సిరీస్‌ని డైరెక్ట్‌ చేయనున్నారని టాక్‌. ఒక వేశ్య జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్న క్రిష్‌ ఆ తర్వాత ఈ వెబ్‌ సిరీస్‌ను పట్టాలెక్కిస్తారని భోగట్టా. 

కాగా ‘కన్యాశుల్కం’ నవలను కూడా వెబ్‌ సిరీస్‌గా తీయాలనుకుంటున్నార ట క్రిష్‌. మరో దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ వినూత్న కథాంశాలతో ‘24’, ‘మనం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రేమ కథలతో యువతని, కుటుంబ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసిన విక్రమ్‌ కె. కుమార్‌ బుల్లితెర     ప్రేక్షకులను భయపెట్టనున్నారు. తొలిసారి ఆయన ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌ ద్వారా హీరో నాగచైతన్య  ఫస్ట్‌ టైమ్‌ డిజిటల్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

‘మనం, థ్యాంక్యూ’ చిత్రాల తర్వాత చైతన్య–విక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘దూత’ హారర్, థ్రిల్లర్‌ జానర్‌లో  ఉంటుందని సమాచారం.      నాగచైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.     ఇందులో హీరోయిన్లు పార్వతి, ప్రియా భవానీ శంకర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ‘దూత’ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇక ‘అందాల రాక్షసి’ వంటి ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ వరకూ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్టు అనిపించు కున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలకు సెంటిమెంట్, భావోద్వేగాలను జత చేసే ఆయన తొలిసారి ఓ వెబ్‌ సిరీస్‌కి పచ్చజెండా ఊపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్‌లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ రాలు అధికారికంగా ప్రకటించలేదు.

ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్‌ ప్రకటించినవారిలో దర్శకుడు తేజ ఉన్నారు. హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారాయన. అయితే ఈ ప్రాజెక్ట్‌ వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు యువదర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ‘పిట్ట కథలు’లో ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించారు. తాజాగా సోనీ లివ్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ కమిట్‌ అయ్యారు.

అలాగే ‘బెస్ట్‌ యాక్టర్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, వజ్ర కవచధర గోవింద’ వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అరుణ్‌ పవార్‌  ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్‌ ఆనంద్‌        సంతోష్‌’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించారు. ఈ సిరీస్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘అసుర’ మూవీ డైరెక్టర్‌ కృష్ణ విజయ్‌ కూడా ‘పరంపర’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించారు. గోపీచంద్‌ హీరోగా ‘పంతం’ సినిమాని తెరకెక్కించిన కె. చక్రవర్తి రెడ్డి ‘పులి–మేక’ అనే ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం             వహిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సిరీస్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది.  వీరితో పాటు మరికొందరు దర్శకులు వెబ్‌ సిరీస్‌ల కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top