దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల: ది గ్రేట్’. ఈ బయోపిక్‌లో ఘంటసాలగా కృష్ణచైతన్య, మృదుల ఘంటసాలగా సావిత్రమ్మ, చిన్న ఘంటసాలగా అతులిత, కీలక పాత్రలో సుమన్ నటించారు.
సీహెచ్ రామారావు రచన, దర్శకత్వంలో అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో సీహెచ్ ఫణి నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కృష్ణ చైతన్య మాట్లాడుతూ – ‘‘ఘంటసాలగారి పాటలు వింటూ పెరిగిన నాకు ఈ సినిమాలో ఆయన పాత్ర చేసే అదృష్టం దక్కడం ఒక వరం’’ అన్నారు. ‘‘ఇప్పటికే 70కి పైగా చిత్రాలు రిలీజ్ చేసిన నాకు ఘంటసాలగారి బయోపిక్ రిలీజ్ చేసే చాన్స్ రావడం నా అదృష్టం. ఈ చిత్రం ‘శంకరాభరణం’ లెవల్లో వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు నిర్మాత–డిస్ట్రిబ్యూటర్ శోభారాణి.
‘‘ఘంటసాలగారి గురించి ఈ తరానికి తెలియాలనే తపనతో ఈ సినిమా తీశాం’’ అన్నారు సీహేచ్ రామారావు. ఈ చిత్రం తొలి టికెట్‌ను రూ. లక్షతో చదలవాడ శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. నిర్మాత ఫణి, రచయిత అనంత శ్రీరామ్, దర్శకుడు రేలంగి నరసింహారావు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రచయిత జేకే భారవి పాల్గొన్నారు.


