పదేళ్ల వయసులోనే డైరెక్టర్‌.. గిన్నిస్‌ బుక్‌లో చోటు | Kishan Shrikanth Turns Director At Age of 10 Years | Sakshi
Sakshi News home page

Kishan Shrikanth: పదేళ్ల వయసులోనే డైరెక్టర్‌.. తెలుగులోనూ..

Jun 14 2025 5:22 PM | Updated on Jun 14 2025 5:49 PM

Kishan Shrikanth Turns Director At Age of 10 Years

ప్రతి వారం టీవీలోనో, ఓటిటి (OTT)లోనో, థియేటర్‌లోనో ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాం. సినిమా తీయడం టీమ్‌ ఎఫెర్ట్‌. చాలామంది కలిసి పని చేస్తేనే సినిమా తయారవుతుంది. వాళ్లందరూ ఏమేం చేయాలో చెప్పేవాడే డైరెక్టర్‌. అందుకే డైరెక్టర్‌ని ‘కెప్టెన్‌ ఆఫ్‌ ద షిఫ్‌’ అని పిలుస్తారు. ఎంతో అనుభవం, టాలెంట్‌ ఉంటే తప్ప డైరెక్టర్‌గా మారడం కష్టం. అలాంటిది  పదేళ్ళ పిల్లాడు దర్శకుడిగా మారి సినిమా తీశాడంటే, ఆ సినిమా గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిందంటే నమ్మడం సాధ్యమేనా? అవును సాధ్యమే! 

చిన్న వయసులోనే..
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు కర్ణాటకకి చెందిన కిషన్‌ శ్రీకాంత్‌. బెంగళూరులో జన్మించిన కిషన్‌ చిన్నప్పటినుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి చూపించాడు. ఆ ఆసక్తి ఇష్టంగా మారి ఏకంగా సినిమాని డైరెక్ట్‌ చేసేదాక తీసుకెళ్లింది. 2006లో Care of Footpath సినిమాను పదేళ్ళ వయస్సులో కన్నడలో తీశాడు కిషన్‌.  అనాథ బాలుడు విద్యను కాంక్షించే నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, సౌరభ్‌ శుక్లా, జయశ్రీ వంటి ప్రముఖ నటులు నటించారు. 

అంతర్జాతీయంగా..
మొత్తం ఐదు భారతీయ భాషల్లో డబ్‌ అయిన ఈ సినిమా 54వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో గోల్డెన్‌ లోటస్‌ అవార్డ్‌తో పాటు కర్ణాటక స్టేట్‌ అవార్డును గెలుచుకుంది. అంతర్జాతీయంగా కూడా సైప్రస్, ఇటలీ, దక్షిణ కొరియా ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, పూర్తి నిడివిగల ఫీచర్‌ ఫిలింని డైరెక్ట్‌ చేసినందుకు ‘అతి పిన్న ఫీచర్‌ ఫిలిం డైరక్టర్‌గా గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్స్‌ సాధించాడు కిషన్‌.

సినిమాలు
ఆ తరువాత కాలంలో Care of Footpath సీక్వెల్‌ను త్రిభాషా చిత్రంగా కన్నడ, హిందీ, తెలుగులో డైరెక్ట్‌ చేశాడు కిషన్‌. ఇందులో జువెనైల్‌ నేరాలు, న్యాయ వ్యవస్థ పనితీరుల గురించి చర్చించారు. ఇషా డియోల్‌, అవికా గోర్‌ నటించారు. ఈ రెండు సినిమాలతో పాటు Kill Them Young (2015), Teenage (2013), Enidu Manasali (2014), Maanja (2016) వంటి సినిమాలను డైరెక్ట్‌ చేశాడు. మరికొన్నిట్లో నటించాడు కూడా!

Advertisement
 
Advertisement
Advertisement