
'కేజీఎఫ్' సినిమాతో చాలామంది నటీనటులు గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఈ మూవీలో శెట్టి అనే పాత్రలో కనిపించిన నటుడు దినేష్(63) ఇప్పుడు తుదిశ్వాస విడిచాడు. గతవారం ఈయన బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఐదురోజుల పాటు చికిత్స అందించారు. అయితే ఇంటికి తీసుకొచ్చి వైద్యం అందించారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో సోమవారం ఉదయం 3:30 గంటల సమయంలో కన్నుమూశారు.
(ఇదీ చదవండి: ఎంతో బాధ అనుభవించా.. పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు: ఉపాసన)
కర్ణాటకలోని కుందపురకు చెందిన ఈయన.. మంగళూరు దినేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో పనిచేసేందుకు బెంగళూరు వచ్చేశారు. అలా తొలుత ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. తర్వాత సైడ్ క్యారెక్టర్స్, విలన్ రోల్స్ చేశారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పలు కన్నడ సినిమాల్లో నటించినప్పటికీ.. 'కేజీఎఫ్' మూవీలో శెట్టి పాత్రతో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్నారు.
ఈయన మృతి చెందిన విషయాన్ని ప్రకటించిన కుటుంబ సభ్యులు.. బెంగళూరులోని నివాసంలో సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచుతామని చెప్పుకొచ్చారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దినేష్ హఠాన్మరణం కన్నడ ఇండస్ట్రీలో విషాదం నింపింది. పలువురు నటీనటులు ఈయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దినేష్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)