
'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. యశ్ సరసన నటించిన ముద్దుగుమ్మ తన గ్లామర్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ తర్వాత నాని హీరోగా వచ్చిన హిట్ -3 మూవీలో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్‌ను రిజెక్ట్ చేశానన్న వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందించింది. ఆడిషన్‌కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్‌కు ఎవరైతే సెట్ అవుతారో నిర్మాతలు డిసైడ్ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్‌కు నేను ఆడిషన్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపింది.
సీత పాత్రకు ఆడిషన్‌లో నన్ను సెలెక్ట్ చేయలేదని.. అంతకుమించి ఏం జరగలేదని శ్రీనిధి బ్యూటీ చెప్పింది. నేను ఎంపిక కాకపోయినా.. సౌత్ నుంచి సాయి పల్లవిని తీసుకోవడం నాకు ఆనందంగా అనిపించిందన్నారు. అంతే కానీ ఈ పాత్రను తాను రిజెక్ట్ చేయలేదని కేజీఎఫ్ భామ చెప్పుకొచ్చింది.
శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చిత్రం 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్‌గా చేసింది.