Keerthy Suresh: సొంత ఊరు వెళ్లలేక.. ఉదయనిధితో ఓనం

Keerthy Suresh Onam celebration with Udhayanidhi Stalin - Sakshi

మలయాళీల పండుగ పర్వదినాలలో ఓనం ముఖ్యమైనది. అందరూ సంప్రదాయ వస్త్రధారణతో విశేషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా ఈ పండుగ జరుపుకోవడం కోసమే స్వగ్రామాలకు చేరుకుంటారు. ఇందుకు సినిమా నటీమణులు అతీతం కాదు. నయనతార వంటి అగ్రతారలు కూడా చెన్నై నుంచి కేరళలోని తమ స్వగ్రామానికి చేరుకుంటారు. అదే విధంగా గత ఏడాది నయనతార, విఘ్నేష్‌ శివన్‌తో కలిసి తన ఇంటిలో ఓనం పండుగ జరుపుకున్నారు.

నటి కీర్తి సురేష్‌ కూడా అదే విధంగా ఈ వేడుకలను తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. మలయాళం, తెలుగు, తమిళ భాషలలో నటిస్తూ బిజీగా వున్నా ఈ బ్యూటీ ఈ ఏడాది కూడా ఓనం పండుగను తన కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని ఆశించిందట. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామన్నన్‌ చిత్రంలో నటిస్తోంది.

మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. మే నెలలో షూటింగ్‌ ప్రారంభించుకున్న ఈ చిత్రం నిర్విరామంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. దీంతో కీర్తి సురేష్‌ ఓనం పండుగకు సొంత ఊరు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ పండుగను చెన్నైలోనే జరుపుకుంది. ఆ పండుగ కళను ఇక్కడికే తీసుకొచ్చింది.

చక్కని సంప్రదాయ దుస్తులు ధరించి రంగు రంగుల ముగ్గులతో స్వయంగా రంగవల్లితో ఓనం పండుగను జరుపుకుంది. దీంతో ఉదయనిధి స్టాలిన్‌ ఆమెతో పాటు చిత్ర యూనిట్‌కు విందును ఏర్పాటు చేశారు. మామన్నన్‌ చిత్ర యూనిట్‌ ఈమెకు ఓనం పండుగ శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ అమ్మడు త్వరలో విజయ్‌ కథానాయకుడు నటించనున్న తన 67వ చిత్రంలో ఆయనకు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top