
ఇటీవల కరోనా బారిన పడ్డ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తున్నారు? ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా గురించి ఏం చెబుతున్నారు? ఓటీటీలపై ఎన్టీఆర్ అభిప్రాయం ఎలా ఉంది? రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్), కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎన్టీఆర్ నోట వస్తే అది ఆయన ఫ్యాన్స్‌కు ఫుల్ హ్యాపీ. హాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఈ విధంగా...
► మొదటి సినిమా (‘నిన్ను చూడాలని’) చేసే సమయానికి నా వయసు 17 ఏళ్లు. 365 రోజులూ పని చేయాలనుకునే వ్యక్తిని నేను. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఇంటికి పరిమితం కావడం పంజరంలో ఉన్నట్లుగా ఉంది. అయితే నా పిల్లలు (భార్గవ్ రామ్, అభయ్ రామ్), కుటుంబసభ్యులతో సమయం గడిపే అవకాశం లభించడం కాస్త ఊరట కలిగించే విషయం.
► ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం) చిత్రం ప్రొడక్షన్ వర్క్ 2018లో మొదలైంది. కానీ కరోనా ఫస్ట్ వేవ్ వల్ల దాదాపు ఎనిమిది నెలలు మేజర్ షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్, సాంకేతికతకు సంబంధించిన పని కూడా చాలానే ఉంది. యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పాలంటే ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ను అక్టోబరులోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి.. దర్శక–నిర్మాతలు మరోసారి ఆలోచించుకునే అవకాశాలు లేకపోలేదు.
► కరోనా ప్రభావం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా బడ్జెట్‌ని కానీ, కథను కానీ ప్రభావితం చేయలేదు. కానీ మా వర్కింగ్ స్పీడ్‌ని బాగా దెబ్బతీసింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ప్రేక్షకులు ధియేటర్స్‌కు వస్తారా? అనిపించింది. అయితే ప్రేక్షకులు సినిమాలు థియేటర్స్‌కు రావడం మాతో పాటు ఇండస్ట్రీలో ఓ కొత్త ఆశను రేపింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ విషయం గురించి నాకు తెలిసి నిర్మాతలు ఎప్పుడూ ఆలోచించలేదు. ‘బాహుబలి’, ‘జురాసిక్ పార్క్’, ‘అవెంజర్స్’ వంటి సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆడియన్స్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేరని నా భావన. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుంది.
► ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇలా దేశవ్యాప్తంగా సినీ మార్కెట్స్‌ను కలిపేశారు. ఇంతకుముందు ఒక తెలుగు సినిమా చైనా, యూకే, అమెరికా వంటి దేశాల్లోని మూవీ మార్కెట్‌ను సైతం ప్రభావితం చేయగలదని మనం ఊహించామా? లేదు. ఇండియన్ సినిమాలు ‘బాహుబలి, దంగల్’ వంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్స్‌లో మంచి ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నేను, రామ్‌చరణ్ నటిస్తున్నాం. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.
► రాజమౌళితో నాకిది నాలుగో (స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ.. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’) చిత్రం. 2001లో తొలిసారి ఆయన సినిమాలో నటించాను. ఇండియన్ సినిమాలో ఏదో సాధించాలనే తపన, ఆలోచనలు అప్పట్నుంచే రాజమౌళిలో ఉన్నాయి. నటీనటుల్లో ఉన్న నటనా నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించునే అవకాశం ఇస్తారు రాజమౌళి. అలాగే ఆయన విజన్‌కు తగ్గట్లు మనల్ని కూడా మౌల్డ్ చేస్తారు.
► ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం 18 నెలలుగా కష్టపడుతూనే ఉన్నాను. ఫిజికల్ అప్పియరెన్స్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాను. ఈ సినిమాకు ముందు నేను 71 కేజీల బరువు ఉండేవాడిని. కానీ ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది కిలోల మజిల్స్ పవర్ పెంచాల్సి వచ్చింది. ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే... వెండితెరపై ఆడియన్స్ చూస్తున్నప్పుడు థియేటర్స్‌లోని సీట్లలో కూర్చోలేరు. అంతలా ఆస్వాదిస్తారు. ఆశ్చర్యపోతారు. ఇంతకన్నా ఈ సినిమా గురించి చెబితే, రాజమౌళి ఓ గొడ్డలి పట్టుకుని నా వెంట పడతారు (సరదాగా..)
నిర్మాత తారక్
యాక్టర్‌గానే కొనసాగాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచనలు లేవు. కానీ నిర్మాతగా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూపించాలని ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపించే ఆలోచనలు ఇప్పటికైతే లేవు. కానీ భవిష్యత్తు మనల్ని ఏ దిశగా నడిపిస్తుందో తెలియదు కదా!
ప్రశాంత్ నీల్‌తో కన్ఫార్మ్
‘జనతాగ్యారేజ్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో నేను మరో సినిమా చేయనున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నా వంతు షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లానే ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాను.
తారక్‌కు చిరు ఫోన్
ఎన్టీఆర్‌కు కరోనా సోకిన నేపథ్యంలో అతనితో ఫోన్లో మాట్లాడానని చిరంజీవి ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు తారక్ (ఎన్టీఆర్) చెప్పా రని, తను ఎనర్జిటిక్‌గా ఉండటం సంతోషంగా ఉందని, త్వరలో తారక్ పూర్తి స్థాయిలో కోలుకుంటారని తాను ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌లో చిరంజీవి పోస్ట్
చేశారు.