
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కేరళ అమ్మాయిగా అభిమానులను అలరించనుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఇప్పటికే పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ కాగా.. ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. చర్చిలో రొమాంటిక్ సీన్ కనిపించడంతో పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ సీన్స్ తొలగించాలంటూ కొందరు ఫిర్యాదు చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత నుంచి ఏదో సందర్భంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీలో నటించేందుకు మలయాళీ నటి దొరకలేదా అంటూ విమర్శలు కూడా వచ్చాయి.
ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇప్పటికే తనపై వచ్చిన ట్రోల్స్‌కు జాన్వీ సమాధానమిచ్చారు. తాజాగా పరమ్ సుందరిని చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీతో పోలుస్తూ నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. సిద్ధార్థ్, జాన్వీ కపూర్ పోస్టర్.. అచ్చం చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని షారుక్, దీపిక పదుకొణెలను కాపీ చేసినట్లు ఉందంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. దీపికా తమిళియన్‌గా నటిస్తే.. నేను మాత్రం ఇందులో సగం మలయాళీ, సగం తమిళియన్ అని తెలిపింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ 'ఐకానిక్ మూవీ అని తెలిపింది.
జాన్వీకపూర్ మాట్లాడూతూ.."నేను ఈ సినిమాలో కేరళకు చెందిన అమ్మాయిగా నటించా. దక్షిణాదికి చెందిన వారందరినీ ఒకచోట చేర్చలేము. ఎందుకంటే ఇది పూర్తిగా భిన్నమైన వాతావరణం. మా సినిమాను చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ సినిమాకు.. పరమ్ సుందరికి ఎలాంటి పోలిక ఉండదు. చెన్నై ఎక్స్‌ప్రెస్ పదేళ్ల క్రితం విడుదలైంది. ఇలాంటి ఐకానిక్ సినిమాలు ప్రతి సంవత్సరం విడుదల కావు. చెన్నై ఎక్స్‌ప్రెస్ ఒక ఐకానిక్ చిత్రం. అందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె లాంటి అగ్ర నటులు నటించారని" తెలిపింది. కాగా.. పరమ్ సుందరి ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.