వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బుల్లితెర నటి | Sakshi
Sakshi News home page

వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్‌ పవిత్ర

Published Thu, Feb 15 2024 8:06 AM

jabardasth Pavithra Love Breakup Her Boyfriend Santosh - Sakshi

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వాలెంటైన్స్‌ డే రోజునే తన ప్రియుడికి బ్రేకప్‌ చెప్పేసి అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో  ఆమె అధికారికంగా తెలిపింది.

తాను ప్రేమించిన సంతోష్‌తో పవిత్ర ఉంగరాలు కూడా మార్చుకుంది. ఓ రకంగా ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లే అని త్వరలో పెళ్లితో ఒకటి అవుతారని అందరూ అనుకున్నారు. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సంతోష్‌తో విడిపోతున్నట్లు వాలెంటైన్స్‌ డే సమయంలోనే పవిత్ర ఇలా తెలిపింది. 'మా శ్రేయోభిలాషులందరికీ మా ఇద్దరి పరస్పర అంగీకారం ద్వారా ఈ విషయం చెబుతున్నాను. సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం.

మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం. జీవితంలో మా వ్యక్తిగత ప్రయాణాలలో  ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు గోప్యత ఇవ్వాలని మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగేందుకు మీ ప్రేమ,  మద్దతు ఉంటుంది అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అంటూ ఇన్‌స్టాలో పవిత్ర తెలిపింది.

గతంలో సంతోష్‌ గురించి పవిత్ర చెప్పిన మాటలు
సంతోష్‌తో ప్రేమలో ఉన్నానంటూ గతంలో పవిత్ర ఇలా తెలిపింది. 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్‌.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను.

జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని  పవిత్ర చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా సంతోష్‌,పవిత్ర ఇద్దరూ విడిపోవడంతో వారిని అభిమానించే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ.. ఇలాంటి సమయంలో ఇద్దరూ మరింత బలంగా ఉండాలని ఆశిస్తున్నారు. గతాన్ని వదిలేసి జీవితంలో కొత్త అడుగులు వేయాలని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.

Advertisement
 
Advertisement