తన వయసు, మనసులో వచ్చిన వస్తున్న మార్పులకు అనుగుణంగా తన సినిమాలు రూపుదిద్దుకున్నాయి అన్నారు బాలీవుడ్ దర్శక దిగ్గజం విదు వినోద్ చోప్రా. 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫిలో మూడో రోజు ఓ సెషన్ సందర్బంగా అయన అహుతులతో పలు అనుభవాలు పంచుకున్నారు. పరిందా సినిమా తీసినప్పుడు , 1942 ఏ లవ్ స్టోరీ సమయంలో, ఇటీవల 12th ఫెయిల్.. తదితర సినిమాలను తన వయసు భావోద్వేగాలు ఎలా ప్రభావితం చేశాయో అయన వెల్లడించారు.

56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫి మూడో రోజు పణజీలోని ఐనాక్స్ వేదిక భారతీయ సాంప్రదాయ కళలతో కళకళలాడింది. తెరపై చూపించే కథలకు ధీటుగా బయట నడిచిన ఈవెంట్లు భారతదేశపు బహురూపాల సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, ముఖ్యంగా సీబీసీ ప్రత్యేక పీఆర్టీలు, తమ జానపద నృత్యాలు, నాట్యరూపాలు, కథా ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. తరతరాలుగా సంక్రమించిన సంప్రదాయాలను, భారతీయ సంస్కృతి యొక్క హృదయ స్పందనను ఈ కార్యక్రమం అద్భుతంగా ప్రతిబింబించింది. సినిమా ప్రేమికులను భారతీయ భూభాగం మొత్తం వెంబడి ఉన్న కళాసంపదతో అనుసంధానించే పనిని ఈ ప్రదర్శనలు సమర్ధవంతంగా నిర్వర్తించాయి.

ఇఫీలో జరిగిన మాస్టర్‌క్లాస్‌ల శ్రేణి లో బాలీవుడ్ సీనియర్ దర్శకుడు విధు వినోద్ చోప్రా, రచయిత అభిజాత్ జోషి జంట, బెర్లినాలే ఫెస్టివల్ డైరెక్టర్ మిస్ ట్రిషియా టట్‌ల్, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్‌ల మధ్య సంభాషణ, థియేటర్ గురువు వినాయకుమార్ తదితరులు నిర్వహించిన సెషన్లు—సృజనాత్మకత, భావోద్వేగ ప్రదర్శన, సినిమా భవిష్యత్తుపై కొత్త సాంకేతికతల ప్రభావం వంటి కీలక అంశాలను లోతుగా చర్చించాయి. ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు కథన నిర్మాణం, ఫెస్టివల్ కూర్పు మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో కూడా పాల్గొన్నవారికి సమగ్రంగా వివరించడం జరిగింది.

ఇఫీ అంతర్జాతీయ గాలా ప్రీమియర్ల విభాగంలో ప్రపంచ సినిమా వైభవాన్ని ప్రేక్షకుల ముందుంచింది. మన తెలుగు పాత చిత్రం మల్లీశ్వరి, ఇటాలియన్–స్విస్ చిత్రం మస్కిటోస్, ఇంగ్లీష్ క్లాసిక్ మూరియల్స్ వెడ్డింగ్, ఫ్రెంచ్ చిత్రం రినోర్, వంటి పలు చిత్రాలు ప్రదర్శించారు సమకాలీన కథనాలు కళాత్మక విలువల సమ్మిళితంగా ఈ చిత్రాలు సినీ ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగించాయి.
ప్రముఖ ప్రచురణ విభాగపు (డిపిడి) తాజా పుస్తకం ‘లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్’ను పి ఐ బి ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రధాన డైరెక్టర్ జనరల్ భూపేంద్ర కైంతోలా, కొంకణి చిత్ర దర్శకుడు రాజేంద్ర తలాక్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంలో కైంతోలా మాట్లాడుతూ, “భారతీయ సినిమా అత్యున్నత గౌరవం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మహనీయుల ప్రయాణాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1969 నుంచి 1991 మధ్య అవార్డు పొందిన దేవికా రాణి, సత్యజిత్ రే, వి. శాంతారం, లతా మంగేష్కర్ తదితర 23 మంది లెజెండ్స్ గురించి ఈ పుస్తకంలో వివరాలు ఉన్నాయి” అని అన్నారు.
ఈ గ్రంథంలో 17 మంది రచయితలు రాసిన 23 వ్యాసాలు ఉండగా, సంకలనం సంజిత్ నార్వేకర్ చేశారు. ముఖ్యంగా, రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు—మిథున్ చక్రవర్తి, ఆశా పారేఖ్—ఈ పుస్తకానికి ప్రత్యేక ముందుమాటలు అందించారని ఆయన వివరించారు. పుస్తకం పట్ల ఆసక్తిని పెంచేందుకు వారి ముందుమాటల నుంచి కొన్ని భాగాలను కూడా చదివి వినిపించారు.
సినిమా, శిక్షణ, సంస్కృతి, కళ అన్నీ కలిసి ఇఫ్ఫీ 2025ను విభిన్నతతో కూడిన అపురూపమైన చిత్రోత్సవంగా ఇఫీ కొనసాగుతోంది.


