తండ్రి-కొడుకుల అనుబంధంతో ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ | I Am Handsome Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

తండ్రి-కొడుకుల అనుబంధంతో ‘ఐ యామ్ హ్యాండ్సమ్’

Jun 9 2026 4:05 PM | Updated on Jun 9 2026 4:10 PM

I Am Handsome Movie Pre Release Event Highlights

తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.

ముఖ్య అతిథి కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘సినిమా విజయానికి అసలు బలం కంటెంట్. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినీ పరిశ్రమలో టాలెంట్‌కు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ, ‘నేను ఏలూరుకు చెందినవాడిని. మా నాన్న అరటిపండ్ల వ్యాపారి. చిన్న పట్టణం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను నాకు నేనే స్టార్ అని గర్వంగా చెప్పుకుంటాను. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాత కేదార్‌నాథ్, కేఎల్ దామోదర్ ప్రసాద్  ఎంతో సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.

ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర బృందం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు, నిర్మాత కేదార్‌నాథ్, సాంకేతిక నిపుణులు సమాధానాలు ఇచ్చారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేస్తాయని, థియేటర్ల నుంచి తృప్తిగా బయటకు వస్తారని వారు తెలిపారు. ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను అలరించేందుకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement