బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీ అయిపోయింది. మహారాణి సీజన్-4తో పాటు మరో ఆసక్తికర సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఢీల్లీ క్రైమ్ పేరుతో వస్తోన్న మూడో సీజన్‌లో హ్యుమా ఖురేషీ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్ కాగా.. మూడో సీజన్ నవంబర్ 13న స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన హ్యుమా ఖురేషి తన రోల్ బడీ దీదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ రోల్ గురించి ఉత్తమంగానే చెబుతున్నా.. నా లైఫ్‌లో చేసిన అత్యంత చెత్త పాత్ర అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా బహుశా చెత్త పాత్రలు పోషించే ఉత్తమ వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తన పాత్ర గురించి మాట్లాడుతూ.. 'బడి దీదీ పాత్ర పోషించడం చాలా సరదాగా ఉంది. చీకటి పాత్రలు చేసినప్పుడు ఎటువంటి పరిమితులు ఉండవు. మీరు స్వేచ్ఛగా ప్రయోగాలు చేయొచ్చు. కానీ నేను కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా. నేను చిత్రీకరించే ప్రతి స్త్రీకి ఏజెన్సీ, దృక్పథం ఉండేలా చూసుకుంటా. ఇక్కడ నాకు కొంత ఏజెన్సీ ఉన్నప్పటికీ.. అది చాలా ప్రతికూలంగా ఉంటుంది. అందుకే నేను దీన్ని చేయాలా వద్దా అని ఆలోచించా. కానీ ఢిల్లీ క్రైమ్ చాలా ముఖ్యమైన సిరీస్ అనిపించింది. ఇది సమాజానికి అద్దం పట్టే కథ. కొన్నిసార్లు బాగా పాపులరైన వ్యక్తి ప్రతికూల పాత్ర పోషించినప్పుడే అది సమస్యను హైలైట్ చేస్తుంది. నా పాత్ర ఈ విషయం గురించి అవగాహన పెంచడానికి సహాయపడితే అది నిజంగా నాకు గౌరవమేనని' వెల్లడించింది.
కాగా.. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ సీజన్-3లొ షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్, సయాని గుప్తా కీలక పాత్రల్లో నటించారు. రిచీ మెహతా, తనూజ్ చోప్రా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి చెందిన 30 మంది అమ్మాయిల ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథ సిల్చార్, ముంబయి, రోహ్‌తక్, సూరత్, ముజఫర్‌పూర్ లాంటి నగరాల్లో జరిగిన ఘటనలో నేపథ్యంలో రూపొందించారు.


