అన్నయ్య కోసం తమ్ముడు మార్చుకున్నాడు! | Hi Nanna teaser released | Sakshi
Sakshi News home page

అన్నయ్య కోసం తమ్ముడు మార్చుకున్నాడు!

Oct 16 2023 6:32 AM | Updated on Oct 16 2023 6:32 AM

Hi Nanna teaser released - Sakshi

‘‘ఎలాంటి లెక్కలు వేసుకోకుండా నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. నా ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ, నాకు నచ్చింది వారికీ నచ్చుతుందనే భరోసా కల్పించారు. ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోసారి అది నిరూపితమవుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో నాని అన్నారు. నాని, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, శ్రుతీహాసన్, బాల నటి కియారా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబరు 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ‘హాయ్‌ నాన్న’ ఉంటుంది. అన్ని ఏజ్‌ గ్రూప్‌లకు నచ్చే సినిమాను కమర్షియల్‌ మూవీ అనుకుంటే..‘హాయ్‌ నాన్న’ మోస్ట్‌ కమర్షియల్‌ మూవీ. మా సినిమాను ముందు డిసెంబరు 21న రిలీజ్‌ చేయాలనుకున్నాం. అయితే ఓ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు, తమ్ముడు అనుకున్న తేదీకే అన్నయ్య వేడుక (ప్రభాస్‌ ‘సలార్‌’ సినిమా విడుదలను పరోక్షంగా ఉద్దేశించి..) కూడా ఖరారైతే.. తమ్ముడు తేదీ మార్చుకుంటాడు’’ అన్నారు. ‘‘ఒక మంచి కథతో ‘హాయ్‌ నాన్న’ తీశాం. నా దర్శకత్వంలోని తొలి సినిమాయే పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందడం హ్యాపీ’’ అన్నారు శౌర్యువ్‌. ‘‘ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు మోహన్, విజయేందర్‌ రెడ్డి. ‘‘కథకు తగ్గట్లే మ్యూజిక్‌ ఇచ్చాను’’ అన్నారు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌.   
 

Advertisement
 
Advertisement
Advertisement