దమ్మున్న దర్శకుడు.. 14 ఏళ్లలో ఐదు బ్లాక్‌బస్టర్లు | Sakshi
Sakshi News home page

HappyBirthdayVetrimaaran: అనుకున్నవి అనుకున్నట్లు తీయట్లేదా? డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందంటే..

Published Sat, Sep 4 2021 11:04 AM

Happy Birthday Vetrimaaran Interesting Facts About Vetrimaaran In Telugu - Sakshi

Happy Birthday Vetrimaaran: పన్నేండేళ్ల సినీ జర్నీలో(మొత్తం పద్నాలుగు ఏళ్లు) ఇప్పటిదాకా తీసింది ఐదే ఐదు సినిమాలు. అన్నీ ఆడియెన్స్‌ని కదిలించే కథలు. పైగా బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ కూడా.. ఒక స్ట్రాంగ్‌ స్టోరీని, అంతే పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడతను,  ఆయన టేకింగ్‌ మాత్రమే కాదు..  ఎంచుకునే స్టోరీ లైన్‌ దగ్గరి నుంచి తెరకెక్కించే ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఏదో ఒక డిఫరెంట్‌ యాంగిల్‌ కనిపిస్తుంది. అందుకే అంతా వెట్రిమారన్‌ను విలక్షణ దర్శకుడిగా పిల్చుకుంటారు. ఇవాళ (సెప్టెంబర్‌ 4) వెట్రిమారన్‌ పుట్టినరోజు..    
 

వెబ్‌ డెస్క్‌ స్పెషల్‌: దర్శకుడు వెట్రిమారన్‌.. ఎంత లేట్‌ అయినా సరే కంటెంట్‌ ఉన్న సినిమా అందిస్తాడనే  ఒక నమ్మకం కోలీవుడ్‌ ఆడియెన్స్‌కి ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్లే సినిమాలు ఆడుతుంటాయి. అయితే ఒక సినిమా కోసం గ్రౌండ్ వర్క్‌ చేసేందుకే ఏళ్ల తరబడి టైం తీసుకుంటాడు వెట్రిమారన్‌. సెట్‌ ప్రాపర్టీస్‌, కాస్టూమ్స్‌, లొకేషన్స్.. ఇలా ప్రతీదాంట్లోనూ కథ కనిపించేలా చూసుకుంటాడు. ఎక్కడా ఏ ఎలిమెంటూ మిస్‌ కాదు. ఆర్ట్‌ డైరెక్టర్‌, వెట్రిమారన్‌ హార్డ్‌ వర్క్ కనిపించేది మొత్తం ఇక్కడే. అంతా రెడీ అయ్యాక షూటింగ్‌ని చకచకా కానిచ్చేస్తాడు. ఇంత పర్‌ఫెక్ట్‌గా సినిమాలు తీస్తున్నా.. తానొక గుడ్ డైరెక్టర్‌ కాదనేది అతని ఫీలింగ్‌. ‘సినిమాలో సీన్లను అప్పటికప్పుడు సిచ్యుయేషన్‌ని  బట్టి మార్చాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు కథను నేను అనుకున్నట్లు తీయలేకపోతున్నా. ఆడియెన్స్‌కి నా కథను కరెక్ట్‌గా కన్వే చేయలేనప్పుడు నేను మంచి దర్శకుడిని ఎలా అవుతా?!’ అని అంటాడు ఆయన.

కాంట్రవర్సీ కాకూడదనే.. 
ప్రతీ దర్శకుడికి ఒక సెపరేట్‌ స్టైల్‌ ఉంటుంది. వెట్రిమారన్‌ స్టైల్‌ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకప్పుడు భాషలకతీతంగా జమీందార్లు, ఉన్నత కుటుంబాల కథలను ప్రధానంగా చేసుకుని సినిమాలు వచ్చేవి. రిచ్‌నెస్‌ అనేది సినిమాలో గ్రాండ్‌గా కనిపించేది. కానీ, కోలీవుడ్‌లో పా రంజిత్‌, మారి సెల్వరాజ్‌ లాంటి దర్శకులు ఆ పరిస్థితి మార్చేశారు. పేద–దళిత నేపథ్యాల్ని హైలెట్‌ చేస్తూ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. వీళ్లలో వెట్రిమారన్‌ మాత్రం కథకి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి మరీ తీస్తున్నాడు. అలాగని అవి రెగ్యులర్ సినిమాల్లాగా ఉండవు.  సబ్జెక్ట్‌ ఎలాంటిదైనా సరే తన సినిమాలో కచ్ఛితంగా ఐదు ఎలిమెంట్స్‌ ఉండేలా చూసుకుంటాడు.
 

‘లొకేషన్‌’.. సినిమాలోని క్యారెక్టర్‌ స్వభావానికి తగ్గట్లే బ్యాక్‌డ్రాప్‌ లొకేషన్‌ ఉంటుంది. 
రెండోది.. మల్టీపుల్‌ ప్లాట్‌లైన్స్‌,  చాలా క్యారెక్టర్లు గజిబిజితో కూడిన ప్లాట్‌లైన్స్‌ కథతో సమానంగా రన్‌ అవుతుంటాయి(వడ చెన్నై). 
మూడు.. బ్లాక్ అండ్ వైట్‌ షాట్స్‌,   సిచ్యుయేషన్‌ని బట్టి కొన్ని ప్రత్యేకమైన సీన్లు బ్లాక్‌ అండ్ వైట్‌ కలర్‌లోకి మారిపోతుంటాయి. 
నాలుగు.. స్ట్రాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌.. సినిమాలో పాటలు ఒక సీక్వెన్స్‌లో రావు. కానీ, అవి సీన్‌కి కనెక్ట్‌ అవుతాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ కూడా సిచ్యుయేషన్‌కి తగ్గట్లు చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది.  
ఐదు..  లిప్‌సింక్‌ మ్యాచ్‌ కాకపోవడం. వెట్రిమారన్‌ సినిమాలు ఒరిజినల్‌ వెర్షనల్‌లో లిప్‌సింక్‌ కచ్ఛితంగా మిస్‌ అవుతుంది. అందుకు రీజన్‌ కాంట్రవర్సీ కాకూడదనే ఉద్దేశంతోనే డైలాగులను అప్పటికప్పుడు మార్చాల్సి రావడం. ‘వడచెన్నై’ విషయంలో డైలాగుల వివాదం ముదరడంతో వెట్రిమారన్‌,  జాలర్లకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
 


ఆణిముత్యాల్లాంటి ఐదు సినిమాలు

సెప్టెంబర్‌ 4 1975 కడలూరు(తమిళనాడు)లో పుట్టిన వెట్రిమారన్‌.. ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చేశాడు. సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్‌తో మాస్టర్‌ డిగ్రీ డిస్‌కంటిన్యూ చేశాడు. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొన్నేళ్లపాటు పని చేశాడు. సోలో డైరెక్టర్‌గా చేసిన తొలి ప్రయత్నానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. నిర్మాతలంతా హ్యాండ్‌ ఇవ్వడంతో డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘దేస్యా నెడుంచలై 47’ కలగానే మిగిలింది. ఆ తర్వాత ‘పొల్లాదావన్‌’తో డైరెక్టర్‌గా మారాడు. 

* పొల్లాదవన్‌(2007).. తండ్రిని కష్టపెట్టి బైక్‌ కొన్న ఒక మిడిల్‌క్లాస్‌ కుర్రాడికి.. ఒక రౌడీ గ్యాంగ్‌ నుంచి ఎదురయ్యే కష్టాలు.. వాటిని నుంచి అతను బయట ఎలా పడతాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ధనుష్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యింది. వెట్రిమారన్‌ మిగతా సినిమాల్లో ఇదొక్కటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగులో ఈ సినిమానే ‘కుర్రాడు’ పేరుతో వరుణ్‌ సందేశ్‌ హీరోగా రీమేక్‌ చేశారు.
   
ఆడుకాలమ్‌(2011).. కోళ్ల పందెల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. గురువు పెట్టైకారన్‌కి అనుచరుడు కరుప్ఫు ఎదురు తిరిగాక.. వాళ్లిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది.  కరుప్పు క్యారెక్టర్‌లో ధనుష్ నటించాడు. 58వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్ స్క్రీన్‌ ప్లే, బెస్ట్ యాక్టర్‌ అవార్డులను ఆడుకాలమ్‌ సొంతం చేసుకుంది.
 
విసారణై(2016)(తెలుగులో విచారణ).. సౌత్‌ ఇండియన్‌ సినిమాకి ఇంటర్నేషనల్‌ లెవల్‌లో గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. నలుగురు కుర్రాళ్లను చేయని దొంగతనం కేసులో పోలీసులు(తెలుగు) హింసించడం, అనుకోని పరిస్థితుల్లో మరొక అధికారి(తమిళ) చేతుల్లో చిక్కుకోవడం, చివరకు ఆ అమాయకులు కథ ఎన్‌కౌంటర్‌లో సమాప్తం కావడం.. ప్రధానంగా థర్డ్‌ డిగ్రీ చుట్టూ తిరిగే కథ విసారణై.  63వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ల్లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ తమిళ్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌(సముద్రఖని), బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో అవార్డులు దక్కించుకుంది. అంతేకాదు 2017లో 89వ ఆస్కార్ అవార్డ్స్‌ ‘ బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ మూవీ’ కేటగిరీలో ఈ సినిమా(ఇంటరాగేషన్ పేరుతో) ఎంపికైంది. కానీ, సరైన ప్రమోషన్‌ లేకపోవడంతో అవార్డు దక్కించుకోలేకపోయింది.
 
వడచెన్నై (2018).. డిఫరెంట్‌ టైమ్‌ లైన్‌లతో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా.  క్యారమ్‌ ప్లేయర్‌ అయిన అన్బు(ధనుష్‌),  అనుకోని పరిస్థితుల్లో లోకల్‌ గ్యాంగ్‌స్టర్స్‌తో చేతులు కలుపుతాడు. అయితే వాళ్ల వల్ల తన వాడ ప్రజలకే ముప్పు ఏర్పడుతుంది. సొంత వాళ్లను కాపాడుకునేందుకు అన్బు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది కథ. దీనికి సమాంతరంగా సాగే రాజన్‌ కథ.. సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేస్తుంది.  హీరో ధనుష్‌కి ఇది తొలి భారీ కమర్షియల్ సక్సెస్‌. దీనికి సీక్వెల్స్‌  రావాల్సి ఉంది.
 

అసురన్‌ (2019).. వెట్రిమారన్ జెట్‌ స్పీడ్‌తో తీసిన ఏకైక సినిమా ఇది. తమిళనాడులోని పంచమీ భూముల హక్కుల బ్యాక్‌ డ్రాప్‌తో ఈ స్టోరీ నడుస్తుంది. బ్రిటీషర్లు షెడ్యూల్‌ క్యాస్ట్‌ వాళ్లకు ఇచ్చిన భూములవి. వాటిని దళితులు ఇతరులకు ఇవ్వడానికి, అమ్ముకోవడానికి వీల్లేదు.  కానీ, శివసామి(ధనుష్‌) అనే వ్యక్తి  భూములపై కొందరు కన్నేస్తారు. ఈ క్రమంలో శివసామి కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. చిన్నకొడుకును కాపాడుకునే క్రమంలో శివసామి ఎలాంటి కష్టాలు పడతాడనేది మిగతా కథ. రచయిత పూమణి ‘వెక్కై’ నవల ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమా తెరకెక్కించాడు వెట్రిమారన్‌. సెన్సేషన్‌ హిట్‌ అయిన ఈ మూవీ తెలుగులో వెంకటేష్‌ హీరోగా ‘నారప్ప’ పేరుతో రీమేక్‌ అయ్యింది. ఈ ఐదు సినిమాలతో పాటు నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన పావా కదైగళ్‌ ఆంతాలజీలో ఊర్‌ ఇరవు(సాయి పల్లవి, ప్రకాష్‌ రాజ్‌ సెగ్మెంట్‌)ను డైరెక్ట్‌ చేశాడు. వెట్రిమారన్‌ అప్‌కమింగ్‌ మూవీలు విడుతలై(పరోటా సూరి లీడ్‌రోల్‌లో), వాడివాసల్‌(సూర్య హీరోగా). 
 
ధనుష్‌తోనే అటాచ్‌మెంట్‌
ధనుష్‌ను పర్‌ఫెక్ట్‌ హీరోగా మార్చేసింది, దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది వెట్రిమారన్‌ అనడం అతిశయోక్తేం కాదు. వెట్రిమారన్‌ ఫస్ట్‌ అనుకున్న ప్రాజెక్ట్‌ ‘దేస్యా నెడుంచలై 47’ ధనుష్‌తోనే తెరకెక్కాల్సింది. కానీ, నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ డ్రాప్‌ అయ్యింది. అదే టైంలో ధనుష్‌ సహకారంతోనే ‘పొల్లాదావన్‌’ సినిమా పట్టాలెక్కడం విశేషం. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ మరింత బలపడింది. అయితే ధనుష్ తోనే సినిమాలన్నీ తీయడానికి కారణం ఆ ఫ్రెండ్‌షిప్‌ మాత్రం కాదని చెప్తుంటాడు వెట్రిమారన్‌. డైరెక్టర్‌గానే కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా వెట్రిమారన్‌ ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు నిర్మించాడు. ‘ఉదయం ఎన్‌హెచ్‌4, నాన్‌ రాజవగా పొగెరిన్‌, పొరియాలన్‌, కాక్క ముట్టై, విసారణై, కోడి, లెన్స్‌, అన్నానుక్కు జై, వడచెన్నై, మిగ మిగ అవసరం’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. వీటిలో ధనుష్‌తో కలిసి కో–ప్రొడ్యూస్‌ చేసిన సినిమాలు ఉన్నాయి.
 

Advertisement
Advertisement