
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీలో వస్తుండాయి పీలింగ్స్ పాట ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట కోసం సినిమా ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌ను కాదని జానపద గాయని దాస లక్ష్మితో పాడించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన లక్ష్మి చిన్నప్పటినుంచే ఫోక్ సాంగ్స్ పాడుతుండేది. పలు పాటల ప్రోగ్రామ్స్‌లోనూ పాల్గొనేది. యూట్యూబ్ వల్ల లక్ష్మి చాలా పాపులర్ అయింది.
పుష్ప 2లో ఛాన్స్
తిన్నా తీరం పడుతలే.. కూసున్నా తీరం పడుతలే.., ఆనాడేమన్నంటినా తిరుపతి.. నిన్ను ఈనాడేమన్నంటినా తిరుపతి వంటి పాటలు ఆమెకు బోలెడంత పేరు తెచ్చిపెట్టాయి. ఇంకేముంది, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.. లక్ష్మి టాలెంట్ గురించి తెలుసుకుని వెంటనే పుష్ప 2లో ఛాన్స్ ఇచ్చారు. అలా ఆమె వస్తుండాయి పీలింగ్స్ పాట పాడింది. అంతకుముందు బ్యాచ్ మూవీలో ఓ పాట, దసరాలో ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ పాడింది.
బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వస్తే..
బిగ్‌బాస్ షోలో ఛాన్స్ వస్తే వెళ్తారా? అన్న ప్రశ్నకు లక్ష్మి తాజాగా ఇలా స్పందించింది. బిగ్‌బాస్ షోకి వెళ్లాలన్న ఆలోచనే రాలేదు. ఎందుకంటే నా భర్త, ఏడాదిన్నర పిల్లాడే నా ప్రపంచం. వారిని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లలేను. బాబు ఇంకా చిన్నవాడు కాబట్టి దుబాయ్, మస్కట్ వంటి దేశాల్లో మూడు, నాలుగు రోజుల ప్రోగ్రామ్స్ ఉంటేనే వెళ్లలేకపోతున్నాను. నేను బిగ్‌బాస్ షో చూస్తూ ఉంటాను. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్లడానికి ప్రయత్నిస్తాను అని లక్ష్మి చెప్పుకొచ్చింది.
చదవండి: Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్ల ఆస్తి ఉంటేనేం?