
దంగల్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించిన ఫాతిమా బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ డినో చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో అలీ ఫజల్ సరసన నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న నటి.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
ఇటీవల ఓ వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ సమయంలో అతన్ని తాను కొట్టానని ఫాతిమా వెల్లడించింది. అయితే తను కూడా తిరిగి తనను గట్టిగా కింద పడేంతలా కొట్టాడని వివరించింది. దీంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది. ఆ సంఘటన తర్వాత తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. అటువంటి పరిస్థితులలో ఎలా స్పందించాలో ఇప్పుడు తెలిసొచ్చిందని పేర్కొంది. మనలో ఏదో తప్పు జరుగుతోంది.. దానికి మనం ఎలా స్పందించాలో మాత్రమే ఆలోచించాలని చెబుతోంది ఫాతిమా.
అంతేకాకుండా ముంబయిలో ఓ టెంపో డ్రైవర్ నన్ను ఫాలో అయ్యేవాడని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కొవిడ్ టైమ్లో ముసుగు ధరించి సైకిల్ తొక్కుతుంటే.. నన్ను చూసిన టెంపో డ్రైవర్ హారన్ మ్రోగించేవాడని.. నేను నా లైన్లో వెళ్తంటే నా వెంటే వచ్చేవాడని వివరించింది. సెలబ్రిటీ అయినా.. సామాన్యులైనా ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని తెలిపింది. దీనికి మీరు కేవలం అమ్మాయి అయి ఉంటే చాలని అన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా సనా షేక్ నటించిన ఆప్ జైసా కోయి ఈ రోజే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇందులో ఆర్ మాధవన్ కూడా నటించారు. ఈ చిత్రం ఇద్దరు మధ్య వయస్కుల మధ్య జరిగే ప్రేమకథగా తెరకెక్కించారు. ఒక స్త్రీ సంప్రదాయ కుటుంబంలో తన ప్రేమ కోసం ఎలా పోరాడుతుందో ఈ మూవీలో చూపించనున్నారు.