అదే నా బలం: విజయ్‌ కనకమేడల

Director Vijay Kanakamedala Emotional Speech At Naandhi Movie - Sakshi

‘‘ఒక మనిషి తప్పు చేశాడో? లేదో? తెలియకుండానే ఐదేళ్లుగా విచారణ ఖైదీగా ఉంటాడు. బయటికొచ్చాక సమాజం అతన్ని విలన్‌ గా చూస్తుంటుంది. అప్పుడు ఏం చేశాడు? అనేదే ‘నాంది’ సినిమా’’ అని దర్శకుడు విజయ్‌ కనకమేడల అన్నారు. ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నాంది’. సతీష్‌ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశా. నవదీప్‌ ‘మొదటి సినిమా’ చేస్తున్నప్పుడు హరీష్‌ శంకర్‌గారు పరిచయమయ్యారు.

ఆ చిత్రానికి ఆయన ఘోస్ట్‌ రైటర్‌. అక్కడి నుంచి మా ప్రయాణం ప్రారంభమై ‘డీజే’ వరకూ కొనసాగింది. ‘మహర్షి’ చూశాక ‘నాంది’లో నరేశ్‌గారు చేస్తేనే బాగుంటుందనిపించింది. కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. ఓ సీన్‌లో న్యూడ్‌గా నటించారు. ‘మా నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) తర్వాత అంత కంఫర్టబుల్‌గా ఫీలయింది మీతోనే’ అని నరేశ్‌గారు అనడం సంతోషంగా అనిపించింది. సేఫ్‌ జోన్‌ లో చాలా కథలు రెడీ చేసుకుని నిర్మాతలను కలిశాను.. కానీ కుదరలేదు. ‘నాంది’ కథ విని, సతీష్‌గారు ఓ మంచి సినిమాతో నిర్మాతగా మారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భావోద్వేగంతో కూడిన కథలే నా బలం.. అలాంటి సినిమాలే తీస్తాను. నా తర్వాతి సినిమా కూడా నరేశ్‌గారితోనే ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top