
రాజశేఖర్ హిట్ చిత్రాల్లో ‘ఎవడైతే నాకేంటి’ ఒకటి. 2007లొ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. అప్పటి వరకు వరుస ప్లాఫులతో సతమతమవుతున్న రాజశేఖర్‌కి.. ఎవడైతే నాకేంటి మూవీ బిగ్ రిలీఫ్‌ని ఇచ్చింది. వి. సముద్ర, జీవిత సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ ఈ చిత్రం మొత్తం నేనే తెరకెక్కించానని..చివరిలో గొడవ చేసి మరీ జీవిత తన పేరుని వేయించుకుందని అంటున్నాడు దర్శకుడు వి. సముద్ర.
హిట్ అవుతుందని తెలిసే.. జీవిత-రాజశేఖర్ పేరు కోసం తనతో గొడవ చేశారని చెప్పారు. రాజశేఖర్ హీరోగా నటించిన ‘సింహరాశి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సముద్ర.. ఆ తర్వాత 2007లో మరోసారి రాజశేఖర్‌తో కలిసి ‘ఎవడైతే నాకేంటి’ సినిమా చేశాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ గొడవ వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పాడు సముద్ర.
ఐదు సినిమాలు రిజెక్ట్ చేశా
సింహరాశి (2001) విడుదల తర్వాత రాజశేఖర్ నాతో మరో సినిమా చేయాలకున్నాడు. ఆయనకు నచ్చిన కథలను నా దగ్గరకు పంపించేవాడు. నేను విని రిజెక్ట్ చేశా. అలా 2001-07 మధ్య కాలంలో ఐదు సినిమాలను రిజెక్ట్ చేశా. దీంతో రాజశేఖర్ హర్ట్ అయ్యాడు. ‘నేను పంపిస్తే రిజెక్ట్ చేస్తాడా’ అనుకున్నాడు. కానీ అవి ఆడవనే విషయం నాకు తెలుసు. నేను ఊహించినట్లే 2001-07 మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన ఏ చిత్రం కూడా విజయం సాధించలేదు.
పరుచూరితో కబురు
ఆయన చెబితే రిజెక్ట్ చేస్తున్నానని తెలిసి చివరకు పరుచూరితో నాకు ఫోన్ చేయించి మలయాళ చిత్రం ‘లయన్’ కథ చెప్పించాడు. అది నాకు బాగా నచ్చింది. రాజశేఖర్‌తో ఈ చిత్రం చేస్తానని చెప్పి.. ఓ కండీషన్ పెట్టా. ఇందులో 60 శాతం మార్పులకు ఒప్పుకుంటే చేస్తానని పరుచూరితో చెప్పా. ఆయన అదే విషయాన్ని రాజశేఖర్‌తో చెబితే.. ‘సముద్ర చేస్తానని ఒప్పుకున్నాడు కదా..అది చాలు’ అన్నాడట.
పేరు కోసం..
జీవిత, రాజశేఖర్ కూడా కథా చర్చల్లో కూర్చుంటారు. సలహాలు ఇస్తుంటారు. నేను చెప్పినట్లుగానే లయన్‌లో భారీ మార్పులు చేసి ‘ఎవడైతే నాకేంటి’ కథ రెడీ చేశాం. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాం. సినిమా బాగా వచ్చింది. దీంతో రాజశేఖర్, జీవిత నన్ను తొలగించి .. డైరెక్టర్‌గా వారి పేరు వేయించుకోవాలనుకున్నారు. ఈ విషయం ఒక రచయిత ద్వారా నాకు తెలిసింది.
గొడవ కోసం ప్లాన్
షూటింగ్ మధ్యలోకి వచ్చిన తర్వాత నన్ను తొలగించాలని వారిద్దరు భావించారు. అందులో భాగంగానే రాజశేఖర్ సెట్‌కి వచ్చి ‘ఈ సీన్ బాలేదు.. అది బాలేదు’ అంటూ ఓవరాక్టింగ్ చేశాడు. జీవిత ఆయనను కూల్ చేస్తున్నట్లు నటించింది. ఇదంతా చూసి.. ‘పేరు కోసం ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నారు? అదే కావాలంటే నాకు డైరెక్ట్‌గా చెప్పండి. మీరే తీసుకొని మీ పేరే వేసుకోండి. నేను ఇక చేయను’ అని బయటకు వచ్చేశా. తర్వాత ఇండస్ట్రీ పెద్దలు చెప్పడంతో మళ్లీ నన్ను రిక్వెస్ట్ చేశారు.
దీంతో నేనే సినిమా మొత్తం కంప్లీట్ చేశా. ఇక చివరిలో మళ్లీ కావాలనే నన్ను ఇరిటేట్ చేశారు. రెమ్యునరేషన్ కూడా సగమే ఇచ్చారు. ఇదంతా తమకు పేరు రావాలనే చేశారు. వ్యక్తిగతంగా జీవిత, రాజశేఖర్ చాలా మంచొళ్లు. రాజశేఖర్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. కానీ పేరు కోసం అలా చేయడం నచ్చలేదు. ఇప్పుడు కూడా నేను రాజశేఖర్‌తో మాట్లాడతా. కలుస్తుంటా. నాకు ఎవరిపై కోపం ఉండదు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు.