ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్యకు కారణాలేంటో తెలుసు.. చనిపోయేలోపు చెప్తా: తేజ

Director Teja Sensational Comments On Uday Kiran Death - Sakshi

ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు దర్శకుడు తేజ. తనను తెలియని విషయాల జోలికి వెళ్లడు కానీ.. తెలిసిని విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తేస్తాడు. ఇతరుల విషయంలోనే కాదు.. తనకు సంబంధించిన విషయాలో కూడా చాలా ఓపెన్‌గా ఉంటాడు. తాజాగా ఈ క్రియేటివ్‌ దర్శకుడు ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్‌ కిరణ్‌ చావుకు కారణాలేంటో తనకు తెలుసని అన్నాడు. 

తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్‌కిరణ్‌. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఉదయ్‌కి అవకాశాలు వరుసకట్టాయి. తదుపరి ‘నువ్వు నేను’ అంతకుమించి హిట్‌ అయింది.  ఆ తర్వాత వచ్చిన 'మనసంతా నువ్వే' కూడా భారీ విజయం సాధించడంతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. కానీ ఆ స్టార్‌డమ్‌ ఎక్కువ రోజులు ఉండలేదు. వరుస సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ఉదయ్‌ కిరణ్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి..  2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్యకు కారణం తనుకు తెలుసని, చనిపోయేలోపు ఆ విషయాలు చెబుతానన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టార్‌డమ్‌ వచ్చినప్పుడు బ్యాలెన్స్‌ మిస్‌ కావడం కామన్‌. నేను దాన్ని తల పొగరు అనుకోలేదు. అమాయకత్వం అనుకున్నా.

తను ప్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ లో అవకాశం ఇచ్చా. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా... గుర్తుపెట్టుకొని మరీ సినిమా అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు’ అన్నారు. నేను అవేవి వద్దని చెప్పా. అతని జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్యకు కారణాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నేను చనిపోయేలోపు ఈ విషయాలను వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్దతి కాదు’అని తేజ చెప్పుకొచ్చాడు.  తేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top