20 రోజుల్లో కథ రాసుకుని..30 రోజుల్లో సినిమా తీశా..

Director Maruthi Manchi Rojulu Vachayi Team Visits East Godavari District - Sakshi

మంచిరోజులు వచ్చాయి దర్శకుడు మారుతి

అనుశ్రీలో సినిమా యూనిట్‌ సందడి 

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): కరోనా సమయంలో సరదాగా 20 రోజుల్లో కథను రాసుకుని, 30రోజుల్లో మంచిరోజులు వచ్చాయి సినిమాను తీశానని ఆ సినిమా దర్శకుడు మారుతి పేర్కొన్నారు. ఆదివారం అనుశ్రీ సినిమా థియేటర్‌ మ్యాట్నీషోకు ఆయన, హీరో సంతోష్‌ శోభన్, నటులు సుదర్శన్, శ్రీనివాసరావు, నిర్మాత ఎస్‌కేఎన్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ సినిమాను సక్సెస్‌ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కమెడియన్‌ సుదర్శన్‌ మాట్లాడుతూ అందరూ థియేటర్లకు ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ముందుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ కరోనా కాలంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని భయం అనే కాన్సెప్ట్‌తో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా తీశామన్నారు. తమ సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేసినా నష్టం లేకపోయినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను  తీసుకురావాలన్న లక్ష్యంతో విడుదల చేశామన్నారు. సినిమా మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే మధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటానన్నారు.

గోపీచంద్‌ హీరోగా ప్రతిరోజు పండగ నిర్మాణ టీమ్‌తో కమర్షియల్‌ సినిమా తీస్తామన్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నానని మారుతి తెలిపారు. హీరో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ యూవీ క్రియేషన్స్, వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నానన్నారు. పాలసీమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానుభావుడు సినిమా ద్వారా ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను నటునిగా వచ్చానని, దర్శకుడు మారుతి ఈ సినిమా ద్వారా మంచి క్యారెక్టర్‌ ఇచ్చి బ్రేక్‌ ఇచ్చారన్నారు. అనుశ్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ మేనేజర్‌ హరిబాబు, అనుశ్రీ థియేటర్‌ మేనేజర్‌ శంకర్, విష్ణు, రాజేష్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top