క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు | Dhurandhar Director Aditya Dhar Cricket Career And Film Career | Sakshi
Sakshi News home page

Aditya Dhar Details: హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్.. ఎవరీ ఆదిత్య ధర్? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Mar 21 2026 6:37 PM | Updated on Mar 21 2026 6:43 PM

Dhurandhar Director Aditya Dhar Cricket Career And Film Career

'డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను'.. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. నటుడు లేదా దర్శకుడు అవ్వాలని ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు కొందరైతే.. అనుకోని విధంగా ఇక్కడొచ్చి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకునేవాళ్లు మరికొందరు. అలాంటి వాళ్లలో 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒకడు. క్రికెటర్ కావాల్సిన ఇతడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఆదిత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

ఢిల్లీలో పుట్టిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన కుర్రాడు. టీమిండియాకి ఎలాగైనా ఆడాలని అనుకునేవాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున కూడా ఆడేవాడు. అయితే 2002లోని భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. క్రికెట్‌లోని రాజకీయాలే దీనికి కారణమని భావించి తను ఎంతగానే నమ్మిన క్రికెట్‌ని పక్కనబెట్టేశాడు. రైటర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. 

తొలుత 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్‌ప్రెస్ పాటల రచయితగా పనిచేశాడు. తర్వాత హల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు కూడా రచయితగా చేశాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర సహాయకుడిగానూ వర్క్ చేశాడు. అయితే 2019లో వచ్చిన 'ఉరి' ఇతడిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిపడేసింది. ఇదే దర్శకుడిగా తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆదిత్య పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ మూవీలో 'హౌ ఈజ్ ద జోష్' డైలాగ్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు.

ఇక అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. తన భార్య, నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్ 370'ని నిర్మించి, రచయితగానూ పనిచేసి హిట్ కొట్టాడు. తొలి మూవీ వచ్చిన దాదాపు ఆరేళ్లకు అంటే గతేడాది డిసెంబరులో 'ధురంధర్'తో వచ్చాడు. సర్‌ప్రైజింగ్ హిట్ కొట్టాడు. 50 రోజులకు పైనే ఇది థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండు రోజుల క్రితం రిలీజైన ధురంధర్ 2 ‍అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు సాధిస్తోంది. క్రికెటర్ కావాల్సిన వాడు ఇప్పుడు బాక్సాఫీస్ మొనగాడు అయిపోయాడు.

ఆదిత్య తల్లి సునీత ధర్.. ఢిల్లీ యూనివర్సిటీలో డీన్‌గా పనిచేయగా, తండ్రి గురించిన సమాచారం అయితే దొరకలేదు. 'ఉరి' తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్‌తో ప్రేమలో పడ్డ ఆదిత్య.. 2021లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీళ్లకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయాన్ని ఈ భార్యభర్తలిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా మూడంటే మూడే సినిమాలు తీసి దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.

(ఇదీ చదవండి: డూప్‌, VFX కాదు.. నిజంగా ధురంధర్‌ హీరోనే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement