Asha Parekh: ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన ఆశా పారేఖ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Dada Saheb Phalke Award: Veteran Actress Asha Parekh Biography, Movies in Telugu - Sakshi

‘కటీ పతంగ్‌’ ‘జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై’ ‘తీస్రీ మంజిల్‌’, ‘కారవాన్‌’... ఆశా  పారేఖ్‌ను గుర్తు చేసుకుంటే ఈ సూపర్‌ హిట్స్‌ అన్నీ గుర్తుకొస్తాయి. ‘జూబ్లీ గర్ల్‌’ ‘హిట్‌ గర్ల్‌’ ఆశా బిరుదులు. ఆమె నటిస్తే సినిమాకు శకునం బాగుంటుందని నమ్మేవారు. ఐదు దశాబ్దాలు సినిమా రంగంలో ఉన్నా కాంట్రవర్సీలు లేవు. సినిమా రంగంలో సుదీర్ఘమైన ఆమె కృషికి నేడు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ దక్కింది. కేంద్ర సెన్సార్‌బోర్డుకు తొలి మహిళా చైర్మన్‌గా పని చేసిన ఆశా పారేఖ్‌ దాదాసాహెబ్‌ ఫాల్కేతో సినిమా రంగంలో తన ఖ్యాతిని సంపూర్ణం చేసుకుంది.

ముంబై శాంటా క్రజ్‌లో ఆశా పారేఖ్‌ నడిపే హాస్పిటల్‌ ఉంది. వంద పడకల హాస్పిటల్‌ అది. పేదవారికి తక్కువ ఫీజుతో, కట్టగలిగే వారికి మామూలు ఫీజుతో వైద్యం చేస్తారక్కడ. జనంలో ఆ హాస్పిటల్‌కు మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆశా పారేఖ్‌ దాని వ్యవహారాలు శ్రద్ధగా పట్టించుకుంటుంది. చిన్నప్పుడు పారేఖ్‌కు డాక్టర్‌ కావాలని ఉండేది. కాని హైస్కూల్లో చదివేప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్‌ చూసి అక్కడంతా రక్తం పారి ఉంటే డాక్టర్‌ అయితే ఇంత రక్తం చూడాలి కదా అని ఆ ఆలోచన విరమించుకుంది. డాన్స్‌ అన్నా ఆమెకు బాగా ఇష్టం. కథక్, భరత నాట్యం, ఒడిస్సీ నేర్చుకుంది. సినిమాల్లోకి వెళ్లాలని లేదు. కాని సినిమా వాళ్లు ఆమెలోని వెలుగును కనిపెట్టకుండా పోలేదు.

⇔ శాంటాక్రజ్‌లో రెండు డబ్బున్న కుటుంబాలు ఉండేవి. ఒక బోహ్రా ముస్లిం కుటుంబం. మరొకటి గుజరాతీ కుటుంబం. గుజరాతీ కుటుంబంలోని అబ్బాయి– బచ్చుభాయ్‌ పారేఖ్‌ ముస్లిం కుటుంబంలోని అమ్మాయి సల్మా లఖ్ఖడ్‌వాలాను ప్రేమించాడు. సల్మా ఆ రోజుల్లోనే పూణె వెళ్లి చదువుకునేది. ఆమెను కలవడానికి ప్రతి ఆదివారం బచ్చుభాయ్‌ పూణె వెళ్లేవాడు. వీళ్ల ప్రేమ దాగలేదు. వారూ దాచదల్చలేదు. ఇద్దరూ పెద్దల అనుమతి లేకుండా రిజిస్టర్డ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత సల్మా పేరు సుధా అయ్యింది. వారికి 1942 అక్టోబర్‌ 2న ఆశా పుట్టింది.

⇔ వీళ్లు ఉంటున్న ఇంటి పక్కనే ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉంటే సినిమా వాళ్లు టాక్స్‌ లావాదేవీల కోసం వచ్చి అక్కడే తిరిగే ఆశాను చూశారు. కాలేజ్‌కు వచ్చిన ఆశా మెరుస్తూ ఉండేది. ‘గూంజ్‌ ఉఠీ షెహనాయి’ సినిమా కోసం ఆశాను బుక్‌ చేసి రెండ్రోజులు షూటింగ్‌ చేసి ‘నీలో హీరోయిన్‌ అయ్యే లక్షణాలు లేవు’ అని పంపించేశారు. మొదటి దెబ్బ. ఎవరైనా విలవిలలాడతారు. అది జరిగిన పది రోజులకు దర్శకుడు నాసిర్‌ హుసేన్‌ ‘దిల్‌ దేకే దేఖో’ (1959)లో హీరోయిన్‌గా బుక్‌ చేశాడు. ‘ఒక సినిమాలో పెట్టి తీసేశారు’ అని నాసిర్‌ హుసేన్‌కు చెప్పినా ‘నాకు కావాల్సింది స్వచ్ఛంగా నవ్వే అమ్మాయి.ఆమె హాయిగా నవ్వితే చాలు’ అని బుక్‌ చేశాడు.

డాన్సులు, డైలాగులు ఆశాకు ఇబ్బంది కాలేదు. మొదటి సినిమా. నాసిర్‌ హుసేన్‌కు పాటలు ముఖ్యం. ఆ పాటల్లో లిప్‌ సింక్‌ చేయడం ఆశాకు వచ్చేది కాదు. షమ్మీ కపూర్‌ ఆమెకు పాటల్లో ఎలా చేయాలో చూపించాడు. తొలి గురువు. ఆ తర్వాత ఆశా పాటలకు పెట్టింది పేరు అయ్యింది. షమ్మీను ఆశా ‘చాచా’ (చిన్నాన్న) అని పిలిచేది. ‘దిల్‌ దేకే దేశ్‌’లో ‘దిల్‌ దేకే దేఖో దిల్‌ దేకే దేఖో దిల్‌ దేకే దేఖోజీ... దిల్‌ లేనే వాలో దిల్‌ దేనా సీఖోజీ’ పాట పెద్ద హిట్‌.

⇔ ఆశా పారేఖ్‌ నటనను తీర్చిదిద్దిన మరో దర్శకుడు విజయ్‌ ఆనంద్‌. ఆమె రెండో సినిమా ‘జబ్‌ ప్యార్‌ కిసీసే హోతాహై’కి దర్శకుడు అతడే. దేవ్‌ ఆనంద్‌ తమ్ముడు. ఆ సినిమాకు దేవ్‌ ఆనంద్‌ హీరో. అప్పటి వరకూ దర్శకుడుగా ఉన్న నాసిర్‌ హుసేన్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారాడు.  ‘సౌసాల్‌ పెహెలే ముఝే తుమ్‌ సే ప్యార్‌ థా’ పాట అందులోదే. దేవ్‌ ఆనంద్‌ వంటి సీనియర్‌ పక్కన ఆశా నిభాయించుకుని రాగలిగింది. దీని తర్వాత నాసిర్‌ హుసేన్‌ ‘ఫిర్‌ వహీ దిల్‌ లాయాహూ’ తీశాడు.

11

ఇందులో జాయ్‌ ముఖర్జీ హీరో. ఆశా పారేఖ్‌ హీరోయిన్‌. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. కాని ఆశా పారేఖ్‌ ‘స్టార్‌డమ్‌’కు చేరుకున్నది మాత్రం ‘తీస్రీ మంజిల్‌’తోనే. దీనికి నిర్మాత నాసిర్‌ హుసేన్‌. దర్శకుడు విజయ్‌ ఆనంద్‌. హీరో షమ్మీ కపూర్‌. మర్డర్‌ మిస్టరీ అయిన ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. షమ్మీ కపూర్‌తో ఆశా జంట పూర్తిగా పండింది. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ పాటతో ఆశా పారేఖ్‌ సినిమా రంగానికి బంగారం అని స్థిరపడింది.
 
⇔ ఆశా పారేఖ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంలో హిట్స్‌ ఇచ్చింది. కలర్‌ వచ్చాక హిట్స్‌ ఇచ్చింది. మహిళా అభిమానులు విపరీతంగా ఉన్న దేవ్‌ ఆనంద్‌తో నటించింది. ఆ తర్వాత అంతకు మించిన ఫ్యాన్స్‌ను చూసిన రాజేశ్‌ ఖన్నాతో నటించింది. రాజేశ్‌ ఖన్నాతో కలిసి ఆశా నటించిన ‘బహారోంకే సప్‌నే’, ‘ఆన్‌ మిలో సజ్‌నా’, ‘కటీ పతంగ్‌’ సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ‘కటీ పతంగ్‌’ లో వితంతువుగా నటిస్తూ తన ప్రేమను వ్యక్తపరచలేక సతమతమయ్యే ఆశా పారేఖ్‌ను ప్రేక్షకులు మెచ్చారు. రాజేశ్‌ ఖన్నాతో ఆశా పాడిన ‘ఆజా పియా తుజే ప్యార్‌ దూ’, ‘అచ్ఛా తో హమ్‌ చల్తే హై’... ఎవరూ మరువలేదు.

⇔ ఆశా పారేఖ్‌ను ప్రతి హీరోతో చేసింది– దిలీప్‌ కుమార్‌తో తప్ప. ధర్మేంద్రతో నటించిన ‘ఆయే దిన్‌ బహార్‌ కే’, ‘ఆయా సావన్‌ ఝూమ్‌ కే’ సూపర్‌హిట్లు. తాగి షూటింగ్‌ చేస్తే సెట్స్‌కు రాను అని ధర్మేంద్రకు వార్నింగ్‌ ఇచ్చి మరీ నటించింది ఆశా. మనోజ్‌ కుమార్‌తో చేసిన ‘ఉప్‌కార్‌’, జితేంద్రతో చేసిన ‘కారవాన్‌’, శశి కపూర్‌తో ‘ప్యార్‌ కా మౌసమ్‌’ పెద్ద హిట్లయ్యాయి. అలాగని అన్నీ తేలిక పాత్రలే ఆశా చేయలేదు. ‘మై తులసీ తేరే ఆంగన్‌ మే’, ‘చిరాగ్‌’ వంటి సినిమాలలో గట్టి పాత్రలు చేసింది. ఆశా పారేఖ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు సాయిరా బాను, వహీదా రెహమాన్, నూతన్, మాలా సిన్హా వంటి వారు పోటీకి వచ్చేవారు. కలర్‌ సినిమాలు వచ్చాక గ్లామర్‌ పాత్రలు చేసే ముంతాజ్, హేమమాలిని వచ్చి గట్టి పోటీ ఇచ్చారు. అయినా సరే ఆశా తన వాటా సినిమాలతో దర్జాగా కొనసాగింది.

⇔ ఆ తర్వాత కేరెక్టర్లు చేసినా మర్యాదగా వాటినీ విరమించింది. ఆశా పారేఖ్‌ సినిమా రంగంలో నటిగా లేకపోయినా డిస్ట్రిబ్యూటర్‌గా, సినిమా నటుల అసోసియేషన్‌కు నాయకురాలిగా, టీవీ ప్రొడ్యూసర్‌గా ఎప్పుడూ సినిమా రంగంలోనే ఉంది. వహీదా రెహమాన్, హెలెన్‌ ఈమెకు మంచి స్నేహితులు. వహీదా రెహమాన్‌తో కలిసి అలాస్కా వెళ్లి ఆ గడ్డకట్టే మంచులో ఆ మధ్య 21 రోజులు ఉండి వచ్చింది. అప్పుడప్పుడు ఈ సీనియర్‌ నటీమణులంతా యాట్‌ మాట్లాడుకుని సముద్రంలో రోజుల తరబడి గడుపుతుంటారు. ఏ వెలితీ లేకుండా ఆమె జీవిస్తోంది. పెళ్లి చేసుకోకపోవడం వెలితి అని ఆమె భావించడం లేదు. ఒక గ్లామర్‌ హీరోయిన్‌కి ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ దక్కడం వినోద రంగమైన సినిమాకు సబబైన గౌరవమే.

ఆశా పారేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే
సుప్రసిద్ధ సినీ నటి ఆశా పారేఖ్‌కు 2020 సంవత్సరానికి సినిమా రంగానికి సంబంధించిన సర్వోన్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే ప్రకటించారు. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలియజేశారు. ఆశా పారేఖ్‌ (79)కు ఈ పురస్కారం రాబోయే శుక్రవారం నాటి 68వ జాతీయ పురస్కారాల ప్రదాన సభలో అందజేస్తారు. అవార్డుకు ఎంపిక చేసిన కమిటీలో ఆశా భోంస్లే, హేమమాలిని, పూనమ్‌ థిల్లాన్, ఉదిత్‌ నారాయణ్, టి.ఎస్‌. నాగాభరణ ఉన్నారు. 2019 సంవత్సరానికి రజనీకాంత్‌ ఈ పురస్కారం అందుకున్నారు.

ఆశా టాప్‌ టెన్‌ సినిమాలు
1. దిల్‌ దేకే దేఖో
2. జబ్‌ ప్యార్‌ కిసీసే హోతాహై 
3.జిద్దీ 4. దో బదన్‌ 
5.లవ్‌ ఇన్‌ టోక్యో 
6.తీస్రీ మంజిల్‌ 
7.ఉప్‌కార్‌ 
8.కటీ పతంగ్‌ 
9.కారవాన్‌ 
10.మై తులసీ తేరే ఆంగన్‌ మే

ఆశా టాప్‌ టెన్‌ పాటలు
1. జాయియే ఆప్‌ కహా జాయేంగే (మేరే సనమ్‌)
2. సాయొనారా సాయొనారా (లవ్‌ ఇన్‌ టోక్యో)
3. పర్దే మే రెహెనే దో (షికార్‌)
4. అచ్ఛా తో హమ్‌ చల్తే హై (ఆన్‌ మిలో సజ్‌నా)
5. నా కోయి ఉమంగ్‌ హై (కటీ పతంగ్‌)
6. నిసుల్తానా రే (ప్యార్‌ కా మౌసమ్‌)
7. ఆయా సావన్‌ ఝూమ్‌ కే (ఆయా సావన్‌ ఝూమ్‌ కే)
8. కిత్‌ నా ప్యారా వాదా హై (కారవాన్‌)
9. ఆంఖోసే జో ఉత్‌రీ హై దిల్‌ మే (ఫిర్‌ వహీ దిల్‌ లాయా హూ)
10. తేరే ఆంఖోంకే సివా దునియామే రఖ్ఖా క్యా హై (చిరాగ్‌) 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top