
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు నిర్మించిన పి.జనార్థన్‌రెడ్డి(పీజేఆర్) ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జున గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. 'ఆ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జునే స్వయంగా వచ్చి రెండు ఎకరాల స్థలం ప్రభుత్వానికి అప్పజెప్పారు. నగర అభివృద్ధిలో హీరోగా ముందు ఉంటానని ఆయన అన్నారు. మంచి సంకల్పంతోనే ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నారంటూ.. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు వాలంటీర్‌గా ఆయన ముందుకు వచ్చారు' అని సీఎం అన్నారు.
గతేడాది ఆగష్టు నెలలో మాదాపూర్‌లో ఉన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్‌హాలును హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. నగరంలోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేతలకు చర్యలు చేపట్టింది. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని ప్రభుత్వం ప్రకటించింది. ఆపై ఆ చెరువు చుట్టూ ఉన్న పలు కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అప్పుడు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది.