
హాలీవుడ్ టాప్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2023లో ఓపెన్‌హైమర్ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు. 96వ అకాడమీ అవార్డ్స్లో ఏకంగా ఏడు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ది ఒడిస్సీ'(The Odyssey).. ఈ మూవీకి రచన, సహ-నిర్మాత కూడా క్రిస్టోఫర్ నోలన్ కావడం విశేషం. ఒక ఎపిక్ యాక్షన్ ఫాంటసీ చిత్రంగా రెడీ అవుతున్న ఈ ప్రాజెక్ట్ 2026 జులై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, నేటి నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
గ్రీకు కవి హోమర్ రాసినట్లు చెప్పబడే పురాతన ఇతిహాసం నుంచి ' ది ఒడిస్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మాట్ డామన్ హీరోగా నటిస్తున్నారు. ఇథాకా ద్వీపానికి గ్రీకు రాజుగా ఆయన నటించాడు. ప్రపంచంలోనే మొదటిసారి పూర్తిగా IMAX కెమెరాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రోజన్ యుద్ధం అనంతరం ఒడిస్సియస్ తన స్వదేశం ఇథాకాకు తిరిగి రావడానికి చేసే సాహసయాత్రను ఆధారంగా తీసుకుని, నోలన్ తనదైన శైలిలో మోడరన్ మానవతా విలువలతో ఈ మూవీలో మిళితం చేశారు. ఈ సినిమా కోసం రూ. 2100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అలాంటి థియేటర్స్ 30 మాత్రమే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న IMAX 70mm టిక్కెట్ల ప్రీ-సేల్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది నోలన్ సినిమాలపై ఉన్న క్రేజ్‌ను సూచిస్తుంది. సినిమా విడుదల కావడానికి సరిగ్గా ఒక సంవత్సరం ముందే టిక్కెట్లు అమ్మకానికి వచ్చేశాయి. అయతే, IMAX 70mm కోసం మాత్రమే ఈ టికెట్లు అందుబాటులో ఉండటంతె అభిమానులు నిరాశ చెందుతున్నారు. IMAX 70mm థియేటర్స్ ప్రపంచంలో కేవలం 30 మాత్రమే ఉన్నాయి. IMAX స్క్రీన్స్లో ఈ చిత్రాన్ని చూస్తే ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని నోలన్ చెప్పడంతో మరింత క్రేజ్ పెరిగింది.
నోలన్ సినిమాలకు జులై సెంటిమెంట్
వార్నర్ బ్రదర్స్ కంపెనీతో నోలన్ ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పటి వరకు నోలన్ రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలను ఈ నిర్మాణ సంస్థే నిర్మించింది. నోలన్ తన సినిమాలను జూన్– జూలై సీజన్‌లో రిలీజ్ చేయడానికి ఇష్టపడతారు. ఆ సెంటిమెంట్‌నే మళ్లీ రిపీట్ చేశారు. నోలన్ గత ఆరు చిత్రాల్లో 5 సినిమాలు జూలైలో రిలీజ్ కావడం విశేషం. ఇప్పుడు ది ఒడస్సీ కూడా 2026 జులై 17న విడుదల కానుంది.