
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం డ్యూయల్ రోల్స్ సీజన్ కనిపిస్తోంది. తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే అభిమానుల ఆనందాలకు అవధులుండవు. అలాంటిది రెండు పాత్రల్లో కనిపిస్తే? ఇక చెప్పేదేముంది... పండగ చేసుకుంటారు. పైగా ద్విపాత్రాభినయం చేస్తే వేరియేషన్ చూపించే అవకాశం కూడా ఉంటుంది హీరోలకి. ఇక డ్యూయల్ రోల్స్‌తో ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్న హీరోలపై ఓ లుక్కేద్దాం.
మరోసారి...
‘రిక్షావోడు, స్నేహం కోసం, అందరివాడు’... ఇలా తన కెరీర్‌లో పలు సినిమాల్లో ద్విపాత్రాభియం చేసి, ప్రేక్షకులను అలరించారు చిరంజీవి(Chiranjeevi ). చాలా రోజుల తర్వాత ఆయన మరోసారి ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి.
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. వినోదం నేపథ్యంలో రూపొందుతోన్న ‘మెగా 157’లో మనసుని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. చిరంజీవి పాత్ర ‘రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, యముడికి మొగుడు, చంటబ్బాయి’ చిత్రాల తరహాలో ఉంటుందని తెలిసింది. ద్విపాత్రాభినయంలో కనిపించనున్న చిరంజీవి తండ్రీ కొడుకులుగా కనిపిస్తారా? లేకుంటే సోదరులుగానా? అనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
రెండు చిత్రాల్లో...
‘బాహుబలి 1, 2’ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు హీరో ప్రభాస్(Prabhas). ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి, బిల్లా’ వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసిన ఆయన ‘ది రాజా సాబ్’తో మరోసారి తన అభిమానులకు, ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో తాత–మనవడు పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా పడింది.
సలార్ 2 లోనూ...
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్’. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబరు 22న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారట ప్రభాస్. ‘సలార్’లో ప్రభాస్ తండ్రి కనిపించకపోయినా ‘సలార్ 2’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన వస్తారని సమాచారం.
రెండు సినిమాల్లోనూ తండ్రి... కొడుకు?
‘‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర: పార్ట్ 1’ చిత్రంలో ఎన్టీఆర్(Jr NTR) చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగుకి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా ఇటీవల జపాన్లో కూడా విడుదలవడం, అక్కడి ప్రమోషన్లలో ఎన్టీఆర్ పాల్గొనడం తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘దేవర: పార్ట్ 2’ రూపొందనుంది. కొరటాల శివ ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ పనుల్లోనే ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ‘దేవర’ చిత్రంలో కేవలం కొడుకు పాత్రనే చూపించారు దర్శకుడు. రెండో భాగంలో తండ్రి పాత్ర సందడి చేయనుంది. తండ్రి పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వస్తుందని టాక్. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ (హృతిక్ రోషన్ హీరో) ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్.
మూడోసారి?
హీరో రామ్‌చరణ్ ‘నాయక్’, ‘గేమ్ చేంజర్’ సినిమాల్లో ద్వి΄ాత్రాభినయం చేశారు. తాజాగా రామ్‌చరణ్ నటిస్తున్న ΄ాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్వి΄ాత్రాభియం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోని ఓ ప్రత్యేక ΄ాటలో కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారని భోగట్టా. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన లేదు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
తొలిసారి...
‘పుష్ప 1, 2’’ వంటి భారీ పాన్ ఇండియా హిట్స్ తర్వాత హీరో అల్లు అర్జున్... తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్‌గా ఖరారు కావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో అల్లు అర్జున్ తొలిసారి ‘ఏఏ 22 ఏ6’లో ద్విపాత్రాభినయం చేయనున్నారట.
ఒక పాత్ర హీరో కాగా మరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి ఆయన ద్విపాత్రాభినయం చేయనుండటంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూ΄÷ందనున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాధాన్యత ఉందట.
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల తరహాలో ఈ మూవీ ఉంటుందని, అందుకే ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్‌ను రంగంలోకి దింపుతున్నారనీ టాక్. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. 2026 ఆగస్టులో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తోందట యూనిట్. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే వార్తలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మరి అల్లు అర్జున్‌ది ద్వి΄ాత్రాభినయమా? త్రి΄ాత్రాభినయమా? అనే విషయంపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలి.
తొలిసారి...
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌లది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ట్యాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటిష్ పాలన నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నారట విజయ్. తండ్రీ కొడుకులుగా వెండితెరపై సందడి చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.
సర్దార్ 2లో...
కార్తీ హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022 అక్టోబరు 21న విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘సర్దార్ 2’. ఇక గత ఏడాది కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ముగిసింది.
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలోనూ ద్వి΄ాత్రాభినయంలో కనిపించనున్నారు కార్తీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రొలాగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాని 2026 పొంగల్‌కి విడుదల చేయనున్నారట మేకర్స్. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా డ్యూయల్ రోల్స్‌లో కనిపించే అవకాశం ఉంది.