Chiranjeevi Interesting Comments On Ram Charan Acting In Acharya Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi Comments On Ram Charan: చరణ్‌ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి

Apr 27 2022 7:34 AM | Updated on Apr 27 2022 11:40 AM

Chiranjeevi Interesting Comments On Acharya Movie And Ram Charan - Sakshi

‘‘ఆచార్య’ సినిమాలో నేను, చరణ్‌ తొలిసారి కలిసినప్పుడు వచ్చే భావోద్వేగమైన సన్నివేశంలో గ్లిజరిన్‌ వాడకున్నా మాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ సీన్‌కి సెట్‌లో అందరూ ఉద్వేగానికి లోనై లంచ్‌ బ్రేక్‌కి కట్‌ చెప్పినా కదల్లేదు. నటన పరంగా చరణ్‌ పరిణితి చెందడం పట్ల ఓ తండ్రిగా, సహ నటుడిగా చాలా గర్వపడుతున్నా’’ అని చిరంజీవి అన్నారు.

Chiranjeevi Interesting Comments On Acharya Movie And Ram Charan" ‘‘ఆచార్య’ సినిమాలో నేను, చరణ్‌ తొలిసారి కలిసినప్పుడు వచ్చే భావోద్వేగమైన సన్నివేశంలో గ్లిజరిన్‌ వాడకున్నా మాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ సీన్‌కి సెట్‌లో అందరూ ఉద్వేగానికి లోనై లంచ్‌ బ్రేక్‌కి కట్‌ చెప్పినా కదల్లేదు. నటన పరంగా చరణ్‌ పరిణితి చెందడం పట్ల ఓ తండ్రిగా, సహ నటుడిగా చాలా గర్వపడుతున్నా’’ అని చిరంజీవి అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్‌ కీలక పాత్రల్లో నటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ..

'చరణ్‌ నటనను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ‘ఆచార్య’లో తన నటన కొత్తగా అనిపించలేదు (నవ్వుతూ). నటన పరంగా నేను ఇప్పటి వరకూ చరణ్‌కి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు.. ఎవరు నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం. తను ఇన్‌వాల్వ్‌ అయి చేస్తే ఒరిజినాలిటీ ఉంటుంది. తనకు తానుగా నేర్చుకుంటూ ఎదుగుతూ ఈ స్థాయికి రావడం హ్యాపీ.' 

'చరణ్‌ ప్రవర్తన చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. డైరెక్టర్‌ సీన్‌ ఓకే అని చెప్పిన తర్వాత కెమెరా ముందు నుంచి సంతృప్తిగా పక్కకి వస్తాడు. సీన్‌  అయిపోయిన తర్వాత కారావ్యాన్‌లోకి వెళ్లకుండా సెట్‌లో అందరితోనూ కలివిడిగా ఉండటం, భోజనం చేయడం హ్యాపీ. సెట్స్‌లో నేను కూడా అలాగే ఉండేవాణ్ణి. ‘ఆచార్య’లో సిద్ధ పాత్రను చరణ్‌ చేయకపోతే ప్రత్యామ్నాయం నా తమ్ముడు పవన్‌  కల్యాణ్‌. ఎందుకంటే కథలో ఆ ఫీల్‌ని పవన్‌ 100 శాతం తీసుకువస్తాడు.'

'‘ఆచార్య’కి మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్‌ చేస్తుండగా నాకు అన్యాయం చేశాడు చరణ్‌(నవ్వుతూ). సెట్స్‌కి సురేఖను(చిరంజీవి భార్య) రమ్మని నేను చెబితే, ‘రావొద్దమ్మా’అంటూ చరణ్‌ రాకుండా చేశాడు. ‘అమ్మ వస్తే నీతో నేను కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. మనం ఇలా షూటింగ్‌లో ఇన్ని రోజులు గడిపే అవకాశం మళ్లీ రావొచ్చు.. రాకపోవచ్చు.. ఇక్కడ మీతో కలిసి ఉండటం మధురానుభూతి..’ అంటూ సురేఖను సెట్స్‌కి రానివ్వకుండా చేశాడు.'

'నేను నిత్య విద్యార్థిని. నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్రతి ఒక్కరినీ ఆచార్యగానే భావిస్తా. నేను నటనను ‘అ ఆ’లతో ప్రారంభిస్తే చరణ్‌ ఏకంగా యూనివర్సిటీకి వెళ్లిపోయాడు. పాత పాత కలిస్తే ఏమవుతుంది మోత తప్ప. నేను పాత కాబట్టి కొత్త దర్శకులతోనే చేస్తున్నా(నవ్వుతూ). కొత్త దర్శకులతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నా.'

ఇద్దరూ ఆ చాన్స్‌ ఇవ్వలేదు : కొరటాల శివ 
నా ఆలోచనల నుంచి వచ్చిన కథే ‘ఆచార్య’. పూర్తిగా కల్పితమైన స్టోరీ. ‘ఆచార్య’ లో కాషాయం, కమ్యూనిజం నేపథ్యాలను మాత్రమే తీసుకున్నాం. ధర్మం కోసం పాటుపడే ఇద్దరు బలమైన వ్యక్తుల కథ ఇది. ఇందులో సిద్ధ పాత్రకు మహేశ్‌బాబును తీసుకోవాలనుకోలేదు. చిరంజీవి, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌  సీన్స్‌ ఉన్నప్పుడు మానిటర్‌లో ఎవర్ని చూడాలా అని కన్‌ప్యూజ్‌ అయ్యేవాణ్ణి. ఎలాంటి సన్నివేశంలోనూ వారిద్దరూ రీటేక్, రీషూట్‌కి చాన్స్‌ ఇవ్వలేదు. 

ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించా: రామ్‌చరణ్‌
‘ఆచార్య’ లో నాన్న(చిరంజీవి)తో చేయడం నిజంగా ఒత్తిడితో కూడిన పనే. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించా. రాజమౌళిగారు చెప్పినట్టు సెట్స్‌లోకి నేనెప్పుడూ తెల్లకాగితంలా వెళతా. పాత్రని అర్థం చేసుకుని డైరెక్టర్స్‌కి మౌల్డ్‌ అవుతాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నా సినిమా. ‘ఆచార్య’ నాన్నగారిది. ఇందులో నేను అతిథి పాత్ర చేశా. మా సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన మహేశ్‌ బాబుకి థ్యాంక్స్‌.  

అడగడంలో తప్పు లేదు: చిరంజీవి 
కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా కుంటుపడింది. అలాంటప్పుడు చిత్రపరిశ్రమ మేలు కోసం చేయూత ఇవ్వండి అని ప్రభుత్వాలను వేడుకోవడం తప్పు కాదు. సినిమా పరిశ్రమ నుంచి 50కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. ప్రభుత్వాలు కనికరించి టిక్కెట్‌ ధరల పెంపు జీవోలు ఇచ్చాయి.. ప్రేక్షకులు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ప్రేక్షకులకు వినోదం అందించడానికి అత్యధిక బడ్జెట్‌ పెట్టాం.. అనుకోని పరిస్థితుల్లో తీసుకున్న అప్పులకు అంతకంత వడ్డీలు అయ్యాయి. ప్రభుత్వాలకు మేము 42 శాతం పన్నులు కడుతున్నాం. వాటిల్లో నుంచి కొంత ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement