
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సాధారణంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. సందర్భం ఏదైనా సరే ఆయన ప్రసంగాలు ఎప్పుడూ చాలా సెన్సిబుల్‌గా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తన వయసుకు తగ్గట్టుగా, సినీ పరిశ్రమలోని యువతరానికి దిశానిర్ధేశ్యం చేసే విధంగా మాట్లాడడానికే ఆయన ఇటీవల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన యువ హీరోల ప్రీ రిలీజ్‌లు, ఆడియో రిలీజ్‌లు, జర్నలిస్ట్‌ల బుక్ రిలీజ్‌లు... ఇలా వీలైనన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వారిని ఆశీర్వదిస్తూ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కు లేని లోటు తీరుస్తున్నారు.
నిజానికి సుదీర్ఘ సినీ ప్రయాణం చేసిన చిరంజీవి లాంటి సీనియర్ నటులు ఎవరైనా చేయాల్సిన పని అదే. మరీ ముఖ్యంగా ఎవరి అండా లేకుండా ఎన్నో కష్టనష్టాలు, వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూసిన చిరంజీవి లాంటి వారి మార్గదర్శకత్వం యువ తరానికి ఎప్పుడూ కావాల్సిందే అనడంలో సందేహం లేదు.
నిన్నటి తరం హీరోలు ఆ విధంగా నేటి తరాన్ని గైడ్ చేయడం ఎంతైనా అవసరం. అందుకు తగిన సత్తా, అందుకు తగినంత అనుభవం...వీటన్నింటినీ మించి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉండే స్వభావం వల్ల చిరంజీవి మాత్రమే అందుకు అర్హులు కూడా. ఆయనతో సమకాలీకుడైనప్పటికీ బాలకృష్ణ లో ఆ పాత్ర పోషించగల నేర్పు, ఓర్పు లేవు. ఆయనకు ఉన్న నోటి దురుసుతనం కావచ్చు, ప్రసంగాల్లో అపరిపక్వత కావచ్చు... ఆయన యువతరానికి మార్గదర్శకత్వం వహించడానికి నప్పరు. ఇక వెంకటేష్, నాగార్జునలకు సైతం ఆ శక్తి, ఆసక్తి కూడా లేవు కాబట్టి వారు చేయలేరు...చేయరు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు పెద్ద సంఖ్యలో వస్తున్న యంగ్ టాలెంట్‌కు చిరంజీవి మాటలు శిరోధార్యంగా అనిపిస్తాయి.
అయితే ఇంతటి బాధ్యతను అప్రయత్నంగానే తలకెత్తుకున్న చిరంజీవి ప్రసంగాలు ప్రవర్తన ఇటీవల దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. తాజాగా లైలా(Laila Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు ఈయన చిరంజీవేనా లేక బాలయ్యగా మారిపోయారా అన్నట్టుగా ప్రవర్తించారు. సినిమాలో విష్వక్‌సేన్ పాత్ర గురించి చెబుతూ అమ్మాయి గెటప్‌లో అందంగా ఉన్నాడు అని చెప్పి సరిపెట్టకుండా పదే పదే భలే ఉన్నాడు బుగ్గ కొరికేయాలని అనిపించింది మగవాళ్ల మనసు దోచుకుంటాడు... అంటూ బబర్థస్త్ కామెడీకి తీసిపోకుండా మాట్లాడడం ఆశ్చర్యకరం.
అలాగే ఆ సినిమా హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి స్పందించిన విధానం ఆయన నైజానికి విరుద్ధంగా కనిపించింది. ఆమెతో నాతో చేయి కలిపావుగా ఇక గుర్తుండిపోతావు, థాంక్యూ అంటూ అనడం, ఇక సుమను లండన్‌కు తీసుకెళతానంటూ సందర్భం లేకుండా మాట్లాడడం... ఆయన స్థాయికి తగ్గట్టుగా అనిపించదు.
ఈ ఈవెంట్ ప్రారంభంలో తాను బాలయ్య కాంపౌండ్ హీరో అయిన విష్వక్‌సేన్ సినిమా వేడుకకు రావడం గురించి వినిపించిన వ్యాఖ్యానాలపై చిరంజీవి మాట్లాడారు. పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఈ ఫంక్షన్‌లో ఆయన తీరు చూస్తే... ఆయన కూడా బాలయ్య కాంపౌండ్‌లో చేరిపోయారా అన్నట్టుగా ఉందని కొందరు సినీజీవులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి తాను పోషిస్తున్న పెద్దన్న పాత్రకు వన్నె తెచ్చే విధంగా తన ప్రవర్తనను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.