సిద్ధుకి వుమనైజర్‌ ప్రశ్న.. నేనెందుకు బాధపడతా: చైతన్య జొన్నల గడ్డ | Chaitu Jonnalagadda Response On Lady Journalist Controversy Questions About Siddu Jonnalagadda | Sakshi
Sakshi News home page

నాకు, సిద్ధుకి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎక్కువ..పెద్దగా మాట్లాడుకోం: చైతన్య జోన్నలగడ్డ

Nov 29 2025 4:38 PM | Updated on Nov 30 2025 9:51 AM

Chaitu Jonnalagadda Response On Lady Journalist Controversy Questions About Siddu Jonnalagadda

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డని ఓ మహిళా జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్న ఆ మధ్య వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమాల్లో మీ పాత్ర ఉన్నట్లుగా..బయట కూడా మీరు వుమనైజరా? అని సదరు జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నపై నెటిజన్స్‌ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై సిద్ధు కూడా స్పందించాడు ‘మైకు ఉంది కదా అలా మాట్లాడటం సరికాదు’ అంటూ ఘాటుగానే సమాధానం చెప్పాడు. తాజాగా ఈ ఇష్యూపై సిద్ధు జొన్నలగడ్డ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు.

ఆయన కీలక పాత్రలో నటించిన రాజు వెడ్స్‌ రాంబాయి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘మహిళా జర్నలిస్ట్‌ అడిగిన ఉమనైజర్‌ ప్రశ్నకు సంబంధించిన వీడియో చూశాను. దీనిపై నేను మాట్లాడనుకోలేదు. ఎందుకంటే నా తమ్ముడు వుమనైజర్‌ కాదన్న సంగతి నాతో పాటు అందరికి తెలిసిందే. అలాంటప్పుడు ఎందుకు బాధపడతాం. ఒకవేళ నా తమ్ముడు నిజంగానే వుమనైజర్‌ అయి..ఇప్పుడు బయటపడితే బాధపడేవాళ్లం. అంతేకానీ ఆమె అడిగిందని బాధపడాల్సిన అవసరం లేదు.

 మా తమ్ముడు దీనిపై స్పందించాడు కానీ.. నేను అయితే అసలు రెస్పాండ్‌ అయ్యేవాడిని కాదు. మా వాడికి ఫ్యాన్స్‌ ఉన్నారు కాబట్టి.. అపార్థం చేసుకునే అవకాశం ఉందని లెటర్‌ రాశాడు. అలా ఎందుకు రాశాడో కూడా నాకు వివరించాడు. కానీ మా వాడిని అలాంటి ప్రశ్న అడిగితే నేను ఎందుకు ఫీల్‌ అవుతా? మనం అలాంటివాళ్లం కాదని తెలిసిన తర్వాత బాధపడడం ఎందుకు?’ అని చైతన్య చెప్పుకొచ్చాడు. 

ఇక ఇంట్లో సిద్ధుతో ఎలా ఉంటారని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు ‘మా ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎక్కువగా ఉంది. పెద్దగా మాట్లాడుకోం. సినిమాల గురించి ఇంట్లో తక్కువగా మాట్లాడతాం. అసలు నేను అయితే సినిమాలే చూడను. ఈ మధ్యే సినిమాలు చూడడం స్టార్ట్‌ చేశా. సిధ్దు సినిమాలన్నీ చూస్తాను. కెరీర్‌ ప్రారంభంలో కొన్ని సలహాలు ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు’ అని చెప్పాడు. ఇద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారని అడిగిన ప్రశ్నకు.. ఒక నటుడిగా తనతో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తా కానీ..బ్రదర్స్‌ కదా..ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో సినిమా మాత్రం చేయలేం’ అని క్లారిటీ ఇచ్చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement